అంబటి మీద అన్ని కేసులా?

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి, వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత అంబటి రాంబాబుపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన ఇల్లు, ఆఫీసుపై దాడి జరిగింది. అంబటిపై పలు కేసులు నమోదు కావడంతో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు.

ఈ క్రమంలోనే అంబటికి వైద్య పరీక్షలు నిర్వహించి గుంటూరు మొబైల్ కోర్టులో హాజరుపరిచారు. ఈ నేపథ్యంలోనే అంబటికి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. అంబటిని పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.

ఏపీలోని పలు ప్రాంతాల్లో అంబటిపై 16 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. సీఎం చంద్రబాబుపై అత్యంత అసభ్య పదజాలంతో అంబటి దూషణలకు దిగారని రిమాండ్ రిపోర్టులో పోలీసులు ప్రస్తావించారు.

పదేపదే వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సమాజంలో ఉద్రిక్తతలు పెంచేలా అంబటి తీరు ఉందని ఆరోపించారు.
రెండు వర్గాల మధ్య వైషమ్యాలు పెంచి, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యాఖ్యలు చేసిన
అంబటిని బయటకు వదిలేస్తే లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందని తెలిపారు.

అంతేకాదు, రిమాండ్ విధించకపోతే అంబటికి ప్రాణహాని కలిగే అవకాశముందని పోలీసులు ఆ రిపోర్ట్ లో పేర్కొన్నారు. అంబటిని అరెస్ట్ చేయకుంటే రాష్ట్రవ్యాప్తంగా అల్లర్లు చెలరేగే అవకాశముందని, అందుకే అరెస్టు చేశామని తెలిపారు. ఆ క్రమంలోనే అంబటికి 14 రోజుల రిమాండ్‌తో పాటు పోలీసు కస్టడీ ఇవ్వాలని నల్లపాడు పోలీసులు కోరారు. ఈ క్రమంలోనే అంబటికి గుంటూరు మొబైల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.