తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారని.. పంది, ఆవు కొవ్వులను కూడా వినియోగించారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే.. ఇటీవల ఈ కేసు విచారణను పూర్తి చేసిన సీబీఐ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) నివేదిక ఇచ్చింది. దీనిలో అది నెయ్యే కాదని.. అలాగని పంది కొవ్వు, ఆవు కొవ్వు కలిసినట్టు ఆనవాళ్లు లేవని పేర్కొన్నట్టు వైసీపీ నాయకులు చెబుతున్నారు. ఇది గత కొన్నాళ్లుగా తీవ్ర వివాదంగా మారింది. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
వైసీపీ నేతలు చేస్తున్న ఈ వ్యాఖ్యలపై తాజాగా సీఎం చంద్రబాబు కుప్పం పర్యటనలో స్పందించారు. గతంలో ఎన్‌డీడీబీ(నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు) ఇచ్చిన నివేదిక ఆధారంగానే తాను వ్యాఖ్యానించానని చెప్పారు.
అప్పట్లో ఈవో శ్యామలరావు.. ఎన్‌డీడీబీ నుంచి నివేదిక తెప్పించారని.. దీనినితాను అధ్యయనం చేశానని తెలిపారు. ఆ నివేదికలో పొందుపరిచిన అంశాలపైనే తాను స్పందించానన్నారు. జంతువుల కొవ్వు నెయ్యిలో కలిసిందని ఈ నివేదిక స్పష్టం చేసిందన్నారు. దేశంలోనే అత్యంత విశ్వసనీయ ఎన్‌డీడీబీ నివేదికను ఎవరైనా చదువుకోవచ్చని వ్యాఖ్యానించారు.
కానీ, తనపై లేనిపోని విమర్శలు చేస్తున్నారని.. తాను క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. ఇలాంటి వారిని(వైసీపీ) ఏమనాలని ప్రశ్నించారు. తిరుమల శ్రీవారితో పెట్టుకున్న వారు.. ఈ జన్మలోనే అనుభవిస్తారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
వైసీపీ నేతల పరిస్థితి ఎలా ఉంటుందో నిన్న ఘటనే(అంబటి రాంబాబు) ఉదాహరణ అని పేరు ఎత్తకుండానే చంద్రబాబు దుయ్యబట్టారు. తిరుమల లడ్డూ విషయంలోనే కాకుండా.. అనేక అంశాల్లో అపచారం చేశారని అన్నారు.
కాగా.. గతంలో తిరుమల ప్రక్షాళనలో భాగంగానే అప్పటి ఈవో శ్యామలరావును బదిలీ చేశామని చంద్రబాబు తెలిపారు. ప్రస్తుత ఈవో సింఘాల్ బదిలీపై తర్వాత మాట్లాడతానని వ్యాఖ్యానించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates