సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు సక్సెస్ మీట్లో తన కూతురు సుష్మిత గురించి మాట్లాడే క్రమంలో.. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేదే లేదని.. అమ్మాయిలు స్ట్రిక్ట్‌గా ఉంటే వాళ్లకు ఏమీ కాదని చిరు వ్యాఖ్యానించడం చర్చనీయాంశంమైంది.
ఈ వ్యాఖ్యలను చిన్మయి సహా పలువురు ఖండించారు. ఈ నేపథ్యంలో తమ్మారెడ్డి భరద్వాజ ఈ టాపిక్ మీద మాట్లాడారు. చిరు వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేదని కొట్టి పారేయలేమన్నారు.
మహిళలలపై వేధింపులు ఎప్పుడూ ఉన్నాయని.. ఆ ఆరోపణలను కొట్టిపారేయలేమని ఆయనన్నారు. 1930 ప్రాంతంలో సినిమాలు మొదలైన రోజుల గురించి ఆయన ప్రస్తావించారు. మొదట్లో అంతా బాగున్నా..కొన్నేళ్లకు జమీందారులు, రాజులు సినీ రంగంలోకి వచ్చారని.. మహిళలను అనుభించడం కోసమే సినిమాలు తీశారని ఆయన చెప్పారు.
రాను రాను పరిస్థితులు మారాయని.. తమ రోజుల్లో చాలా వరకు పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయని.. కానీ ఆ రోజుల్లో కూడా 5-10 శాతం మేర మహిళలకు వేధింపులు తప్పలేదని… అందుకోసమే కొందరు ఇండస్ట్రీలో ఉండేవారని ఆయనన్నారు.
ప్రస్తుతం ఏడాదికి 200 దాకా సినిమాలు తెరకెక్కుతున్నాయని.. అందులో కొందరు ఎందుకు సినిమాలు తీస్తున్నారో తెలియని పరిస్థితి ఉందని.. వాళ్లంతా అమ్మాయిలను అనుభవించడం కోసమే సినిమాలు తీస్తుంటారని.. వాళ్లది వేరే వ్యవహారమని ఆయనన్నారు. సీరియస్‌గా సినిమాలు తీసే పెద్ద దర్శకులు, నటులు వీటికి దూరంగానే ఉంటారన్నట్లు ఆయన మాట్లాడారు.
మిగతా ఇండస్ట్రీల్లో ఉన్నట్లే ఈ రంగంలోనూ మహిళలకు వేధింపులు ఉంటాయని.. కానీ వాటిని తట్టుకుని నిలబడాలని.. టాలెంట్ ఉంటే ఎవ్వరూ తొక్కలేరని ఆయన అభిప్రాయపడ్డారు.
చిన్మయి గురించి మాట్లాడుతూ.. ఆమె వేధింపులకు వ్యతిరేకంగా పోరాడినందుకు నిషేధం విధించడం దారుణమని.. ఏడాది పాటు పని లేకపోతే.. తెలుగులో ఆమె నుంచి డబ్బులు తీసుకుని కార్డు ఇస్తే.. ఇక్కడ పని చేసుకుందని వ్యాఖ్యానించారు. ఇప్పుడే తమిళంలో కూడా ఆమెకు అవకాశాలు వస్తున్నాయన్నారు.
ఆమె ఎవరు ఎంత ప్రయత్నించినా వంగలేదని… ఆమెను స్ఫూర్తిగా తీసుకోవాలని తాను మహిళలకు సూచిస్తుంటానని తమ్మారెడ్డి అన్నారు. ఈ సమస్య మీద ఎవరు తమ దృష్టికి తీసుకొచ్చినా అండగా నిలుస్తామని.. దీని మీద అందరూ కలిసి పని చేయాలని.. అంతే తప్ప అదే పనిగా దాని గురించి గుచ్చి గుచ్చి మాట్లాడడం వల్ల ప్రయోజనం లేదని తమ్మారెడ్డి స్పష్టం చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates