అనంతపురం జిల్లాలోని కీలకమైన తాడిపత్రి నియోజకవర్గం మరోసారి రణరంగంగా మారింది. సార్వత్రిక ఎన్నికల తర్వాత.. ఇక్కడ ఘర్షణలు జరిగిన విషయం తెలిసిందే. టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ వైసీపీ మాజీ ఎమ్మలె్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్గీయుల మధ్య తీవ్ర వివాదాలు కొనసాగాయి. ఈ క్రమంలో పోలీసులు జోక్యం చేసుకుని పెద్దారెడ్డిని కొన్నాళ్లు .. నగరం విడిచి వెళ్లాలని చెప్పడంతో కొన్నాళ్లుగా ఆయన తాడిపత్రి నుంచి వెళ్లిపోయారు. దీంతో అప్పటి నుంచి పరిస్థితులు సానుకూలంగా మారాయి. కానీ, తాజాగా మంగళవారం పెద్దారెడ్డి తిరిగి తాడిపత్రిలో అడుగు పెట్టారు.
పెద్దారెడ్డి రాకతో మరోసారి తాడిపత్రిలో రగడ ప్రారంభమైంది. పలు కేసులకు సంబంధించి ఇంట్లో ఉన్న పత్రాలు తీసుకునేందుకు వచ్చానని పెద్దారెడ్డి చెబుతున్నారు. అయితే.. ఆయన వచ్చిన విషయం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు.. పెద్దారెడ్డి ఇంటిని ముట్టడించారు. టీడీపీ కార్యకర్తలు వస్తున్న విషయం పసిగట్టిన పెద్దారెడ్డి వర్గీయులు కర్రలు, రాళ్లతో అక్కడకు చేరుకుని టీడీపీ వారిని తరిమికొట్టేందుకు ప్రయత్నించారు. దీంతో ఇరు పక్షాల మధ్య రగడ తీవ్రస్థాయికి చేరింది. ఈ క్రమంలో పెద్దారెడ్డి అనుచరుడు కందిగోపుల మురళి రెచ్చిపోవడంతో ఆయన ఇంటిపైకి కూడా టీడీపీ కార్యకర్తలు ముట్టడించారు.
ఇంటి ముందు పార్కు చేసిన కారును కొందరు ధ్వంసం చేశారు. స్కూటీలకు నిప్పు పెట్టారు. దీంతో రగడ తీవ్రస్థాయికి చేరింది. ఇరువర్గాల కార్యకర్తల దాడులతో తాడిపత్రిలో హైటెన్షన్ నెలకొంది. విషయం తెలిసిన పోలీసులు రంగంలోకి దిగి ఇరు పక్షాలపైనా లాఠీ చార్జీ చేశారు. అయినప్పటికీ టీడీపీ, వైసీపీ కార్యకర్తలు మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఇరు పక్షాలు రాళ్లు రువ్వుకున్నాయి. దీంతో పెద్దారెడ్డిని తాడిపత్రి నుంచి అనంతపురం పంపించేసిన పోలీసులు నగరంలో పికెట్ ఏర్పాటు చేశారు. ఇదేసమయంలో టీడీపీ కార్యకర్తలను కూడా చెదరగొట్టారు. ఈ పరిణామాలపై డీజీపీ స్పందించి.. మరిన్ని బలగాలను పంపించారు. ఎలాంటి హింసకు తావులేదని.. అవసరమైతే.. ముఖ్య నాయకులను గృహ నిర్బంధం చేయాలని డీజీపీ ఆదేశించారు.