ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. శుక్రవారం మధ్యాహ్నం.. పలు వ్యాపార వేత్తలతో అమరావతిలోని సచివాలయంలో భేటీ అయిన చంద్రబాబు.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే అంశంపై వారితో చర్చించారు. వీరిలో ప్రఖ్యాత టాటా గ్రూపు చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ కూడా ఉండడం విశేషం. ఇక, ఈ కార్యక్రమాల అనంతరం.. చంద్రబాబు సాయంత్రం ఢిల్లీకి ప్రత్యేక విమానంలో చేరుకున్నారు. శుక్రవారం, శనివారం, ఆదివారం సాయంత్రం వరకు కూడా ఆయన ఢిల్లీలోనే ఉండనున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా శనివారం సాయంత్రం 4 గంటల సమయంలో ప్రధాని నరేంద్ర మోడీతో చంద్రబాబు భేటీ కానున్నారు.
శుక్రవారం రాత్రికి ఢిల్లీలో అడుగు పెడుతూనే కేంద్ర జల శక్తి శాఖ మంత్రి పాటిల్‌తో చంద్రబాబు భేటీ అవుతారు. కీలకమైన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు, నిధులపైనా ఆయన చర్చించనున్నారు. అదేవిధంగా కాంట్రాక్టు పనులు, ఇప్పటికే పెండింగులో ఉన్న నిధుల అంశాలను కూడా తేల్చుకోనున్నారు. అనంతరం టీడీపీ ఎంపీలు ఇచ్చే విందులో చంద్రబాబు పాల్గొంటారు. ఈ సందర్భంగా కూడా చంద్రబాబు రాష్ట్ర సమస్యలపై వారితో చర్చించనున్నారు. అన్న క్యాంటీన్లకు స్వచ్ఛంద సంస్థల నుంచి విరాళాలు సేకరించే కార్యక్రమంలో వారిని కూడా భాగస్వామ్యం చేయనున్నారు.
ఇక, శనివారం ఉదయం పార్టీ ఎంపీలతో చంద్రబాబు భేటీ అయి.. జాతీయ రాజకీయాలపై చర్చించనున్నారు. అనంతరం.. ఢిల్లీలోని తెలుగు వారితోనూ చంద్రబాబు చర్చలు జరపనున్నారు. సాయంత్రం 4.30 గంటలకు ప్రధానమంత్రి నరేంద్రమోడీతో చంద్రబాబు సమావేశం కానున్నారు. దాదాపు 40 నిమిషాలపాటు మోడీ ఆయనకు సమయం ఇచ్చారు. ఈ సందర్భంగా అమరావతి నిర్మాణానికి ఇటీవల బడ్జెట్‌లో ప్రకటించిన రూ.15 వేల కోట్ల సాయం సహా.. వెనుక బడిన జిల్లాలకు సాయంపైనా చర్చించనున్నారు. అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కలవనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిని వివరించి.. ఎక్కువ మొత్తంలో పన్నుల్లో వాటా తీసుకునేందుకు ప్రయత్నించనున్నారు.
శనివారం రాత్రి 7 గంటలకు లేదా.. 9 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ అవుతారు. ఈ సందర్భంగా వైసీపీ వ్యవహారం.. ఇటీవల జగన్ ఢిల్లీలో చేసిన ధర్నా, రాష్ట్రంలో శాంతి భద్రతలు, వైసీపీ నేతలకు భద్రత కల్పించే అంశాలపైనా అమిత్‌షాతో చంద్రబాబు చర్చించనున్నారు. ఇటీవల వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. అమిత్‌షాను కలిసి.. రాష్ట్ర ప్రభుత్వంపై ఫిర్యాదులు చేయడం..తమకు, తమ నాయకుడికి భద్రత తగ్గిస్తున్నారని చెప్పిన నేపథ్యంలో షాకు.. వాస్తవ పరిస్థితిని చంద్రబాబు వివరించనున్నట్టు టీడీపీ వర్గాలు తెలిపాయి.