తెలంగాణ శాసనమండలిలో ఉన్న గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నామినేటెడ్ వ్యవహారం మరోసారి వివాదాస్పదం అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణలను ఎమ్మెల్సీలుగా నియమించాలని అప్పటి ప్రభుత్వం అప్పటి గవర్నర్ తమిళిసైకి సిఫారసు చేసింది.
అయితే రాజకీయ నాయకులైన వీరిని ఎమ్మెల్సీగా నియమించడం కుదరదు అంటూ గవర్నర్ తమిళిసై ఆ సిఫారసును తోసిపుచ్చారు. తెలంగాణ ప్రభుత్వంతో విభేదాల నేపథ్యంలో తమిళిసై ఆ నిర్ణయం తీసుకున్నారు. గత ఏడాది జరిగిన ఎన్నికలలో బీఆర్ఎస్ ఓడి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా తెలంగాణ జనసమితి పార్టీ అధినేత కోదండరాం, సియాసత్ ఉర్ధూ దినపత్రిక ఎడిటర్ అమీర్ అలీఖాన్ ల పేర్లను కాంగ్రెస్ గవర్నర్ తమిళిసైకి సిఫారసు చేసింది. వీటిని ఆమె ఆమోదించింది. అయితే రాజకీయ నాయకులన్న కారణంతో తమ పేర్లను తిరస్కరించిన గవర్నర్ ఏకంగా ఓ రాజకీయ పార్టీ అధ్యక్షుడిని ఎమ్మెల్సీగా ఎలా నియమిస్తారని దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణలు హైకోర్టును ఆశ్రయించారు.
వీరి పిటీషన్ ను విచారించిన హైకోర్టు గవర్నర్ నిర్ణయాన్ని తప్పుపట్టింది. దీంతో కోదండరాం, అమీర్ అలీఖాన్ లు ఎమ్మెల్సీలయ్యే అవకాశం అప్పట్లో కోల్పోయారు. తాజాగా అదే కోటాలో కాంగ్రెస్ అదే అభ్యర్థులను సిఫారసు చేసింది. కొత్తగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వచ్చారు. ఈ నేపథ్యంలో గవర్నర్ నిర్ణయం అనంతరం మరోసారి కోర్టును ఆశ్రయించేందుకు దాసోజు శ్రవణ్ సిద్దమవుతున్నారు. దీంతో ఈ సారి కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందా ? అన్న ఉత్కంఠ నెలకొంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates