టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబుపై ఒత్తిడి పడుతోందా? ఎన్నికలకు ముందు పార్టీకి సహకరించిన విభిన్న వర్గాల నుంచి ఆయన ఒత్తిడి ఎదుర్కొంటున్నారా? అంటే ఔననే అంటున్నారు పార్టీ సీనియర్ నాయకులు. ఎన్నికల సమయంలో పారిశ్రామిక వర్గాల నుంచి సామాజిక సమీకరణల వరకు అన్ని వైపులా మద్దతు లభించింది. వీరిలో వైసీపీని సమర్థించిన రెడ్డి సామాజిక వర్గం కూడా ఉంది.ఇదే సమయంలో కమ్మ సామాజిక వర్గం నుంచి భారీ ఎత్తున మద్దతు లభించింది.
ఈ పరిణామాలతో సహజంగానే చంద్రబాబుపై ఒత్తిడి పెరిగింది. కీలక పదవులు.. కార్పొరేషన్ల వ్యవహారం లో తమను పరిశీలనలోకి తీసుకోవాలని వారంతా కోరుతున్నారు. అయితే.. ఇప్పటికే ఉన్న నాయకులు, సీట్లు త్యాగం చేసిన వారు, సీనియర్లను చూసుకుంటే.. వారికి ఇవ్వగా మిగిలే పదవులు చాలా వరకు తక్కువగా ఉన్నాయి. పైగా ప్రధాన పోస్టులకే ఎక్కువగా డిమాండ్ ఉన్న నేపథ్యంలో వాటిని కాదని ఇతర పదవులు ఇస్తే.. తీసుకునేందుకు మిగిలిన వారు సంసిద్ధంగా లేరు.
దీనికితోడు, కూటమి పార్టీలకు కూడా న్యాయం చేయాల్సి వుంది. ఇప్పటికే పదవుల పందేరం విషయంలో ఒక ఫార్ములా అనుకున్నా..దీనికి బీజేపీ అదిష్టానం మొగ్గు చూపడం లేదు. తాము సీట్ల విషయంలో త్యాగాలు చేశామని.. అసెంబ్లీకి 10 సీట్లే తీసుకున్నామని.. కాబట్టి నామినేటెడ్ పదవుల్లో తమకు మెజారిటీ భాగం కావాలని కోరుతున్నట్టు తెలుస్తోంది. దీనిపై చర్చలు అసంపూర్తిగా నిలిచిపోవడంతో ఇప్పటి వరకు నామినేటెడ్ పోస్టుల వ్యవహారంపై చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
త్వరలోనే వీటిని భర్తీ చేస్తామని చెబుతున్నా.. పైనుంచి ఉన్న ఒత్తిళ్లు, అంతర్గతంగా ఉన్న డిమాండ్లను పరిశీలిస్తే.. ఎవరికి పదవి ఇచ్చినా.. ఇబ్బందులు తప్పవనే చర్చ సాగుతోంది. ఈక్రమంలో మరోసారి చంద్రబాబు ఢిల్లీ పర్యటన చేసి.. బీజేపీ నేతలను ఒప్పించడంతోపాటు, అంతర్గత సమావేశాలు నిర్వహించి.. పదవులు కోరుతున్నవారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించాలని భావిస్తున్నారు. ఏదేమైనా అధికారంలోకి వచ్చేందుకు ఎంత ఒత్తిడి ఫీలయ్యారో.. ఇప్పుడు దానికి డబుల్ ఒత్తిడిని ఆయన ఎదుర్కొంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates