చెప్పారు… చేశారు.. జగన్ ఫొటో మాయం

ఎన్నిక‌ల‌కు ముందు చంద్ర‌బాబు చెప్పిన‌ట్టుగానే ఇప్పుడు చేసి చూపించారు. ప‌ట్టాదారు పాసు పుస్త‌కాలు స‌హా భూమి యాజ మాన్య హ‌క్కు ప‌త్రాల‌పై రాష్ట్ర ప్ర‌భుత్వ రాజ‌ముద్ర‌ను మాత్ర‌మే ప‌రిమితం చేశారు. దీంతో రైతులు, భూ య‌జ‌మానులు సైతం ఊప‌రిపీల్చుకున్నారు.

ఎన్నిక‌ల‌కు ముందు.. ప‌ట్టాదారు పాసు పుస్త‌కాల‌ పై అప్ప‌టి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఫొటోల‌తో వాటిని సంబంధించి రైతుల‌కు, భూయ‌జ‌మానుల‌కు అందించారు. దీంతో త‌మ ప‌ట్టా పుస్త‌కాల‌ పై జ‌గ‌న్ ఫొటోలు ఎందుక‌ని రైతులు ప్ర‌శ్నించారు. ఇక‌, భూయ‌జ‌మానులు కూడా త‌మ భూముల‌ పై జ‌గ‌న్ ఫొటోలు ఎందుక‌ని నిల‌దీశారు.

క‌డ‌ప‌లోని జ‌గ‌న్ సొంత నియోజ‌క‌వ‌ర్గం పులివెందుల‌లో జ‌గ‌న్ స‌తీమ‌ణి భార‌తి ఎన్నికల ప్ర‌చారం చేసిన‌ప్పుడు కూడా.. ప‌లువురు వైసీపీ క్షేత్ర‌స్థాయి నాయ‌కులు ఇదే అంశాన్ని ప్ర‌స్తావించారు. ప్ర‌జ‌ల ఆస్థుల‌ పై జ‌గ‌న్ బొమ్మ‌లు వేయ‌డాన్ని వ్య‌తిరేకిస్తున్నారంటూ.. పెద్ద ఎత్తున ప్ర‌శ్నించారు. ఇది రాజకీయంగా పెను దుమారం రేపింది. అనంత‌రం.. ఇదే విష‌యం.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వ‌ర‌కు సాగింది. ప‌ట్టా పుస్త‌కాల‌ పై జ‌గ‌న్ బొమ్మ వేసుకుంటున్న‌వారు.. రేపు మీ భూముల‌ను లాగేసుకోర‌ని గ్యారెంటీ ఏంట‌ని టీడీపీ, జ‌న‌సేన నాయ‌కులు క్షేత్ర‌స్థాయిలో ప్ర‌జ‌ల‌ను చైత‌న్య ప‌రిచారు.

ఈ ప‌రిణామం ఎన్నికల స‌మ‌యంలో తీవ్ర‌స్థాయిలో ప్ర‌చారంలోకి వ‌చ్చింది. ఫ‌లితంగా వైసీపీకి తీవ్ర ఎదురు దెబ్బ త‌గిలింది. ఇక‌, అదే స‌మ‌యంలో తాము అధికార‌లోకి రాగానే ప‌ట్టా పుస్త‌కాల‌పై ఎవ‌రి బొమ్మ ఉండ‌ద‌ని.. రాష్ట్ర ప్ర‌భుత్వ రాజ‌ముద్ర‌తో అంద‌రికీ ఇస్తామ‌ని చంద్ర‌బాబు హామీ ఇచ్చారు. ఇప్పుడు తాజాగా ఆ నిర్ణ‌యాన్ని అమ‌లు చేస్తూ.. చంద్ర‌బాబు నిర్ణ‌యం తీసుకున్నారు. ఇప్ప‌టికే రాష్ట్ర వ్యాప్తంగా 20 ల‌క్ష‌ల మందికి ఇచ్చిన ప‌ట్టా పుస్త‌కాల‌ను వెన‌క్కి తీసుకుని.. వాటిని తిరిగి రాజ‌ముద్ర‌తో ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు.

కొత్త‌గా ఇచ్చేవాటికి మాత్రం ఎవ‌రి బొమ్మ లేకుండానే రైతుల‌కు, భూయజ‌య‌మానుల‌కు అందించ‌నున్నారు. దీంతో రైతుల‌కు, భూయ‌జ‌మానుల‌కు భారీ ఊర‌ట ల‌భించ‌నుంది. నిజానికి ఏ రాష్ట్రంలో కూడా.. ప్ర‌భుత్వాలు ఎన్ని ప‌థ‌కాలు అమ‌లు చేసినా.. ప్ర‌జ‌ల సొంత ఆస్తుల‌పై త‌మ బొమ్మ‌లు చేసుకునేందుకు సాహ‌సించ‌లేదు. త‌మిళ‌నాడును పాలించిన జ‌య‌ల‌లిత కు ప్ర‌చార యావ ఎక్కువ‌గా ఉంద‌నే విష‌యం తెలిసిందే. అమ్మ‌ పేరుతో ఆమె ప్ర‌తి ప‌థ‌కానికి త‌న పేరు పెట్టుకుని, త‌న ఫొటో వేసుకున్నా.. ఇలాంటి విష‌యాల్లో మాత్రం జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. కానీ, ఏపీలో మాత్రం ఎవ‌రు చెప్పారో..ఏమో.. జ‌గ‌న్ మాత్రం త‌న ఫొటోలు వేసుకుని చేతులు కాల్చుకున్నారు.