వైసీపీ పతనమే షర్మిల లక్ష్యమా ?!

తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టి ఏ ఎన్నికలలోనూ పోటీ చేయకుండానే తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పగ్గాలను చేపట్టి కడప ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందారు. ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా తన అన్న, వైసీపీ అధినేత జగన్ ను టార్గెట్ చేసి విమర్శలు చేసిన షర్మిల వైసీపీ ప్రభుత్వ పరాజయంలో కీలకపాత్ర పోషించింది.

ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత కూడా అధికార టీడీపీ పార్టీని వదిలేసి అన్న జగన్, ఆయన పార్టీనే లక్ష్యంగా చేసుకుని షర్మిల విమర్శలు గుప్పిస్తున్నది. వైసీపీ ప్రభుత్వ పతనం తర్వాత కూడా షర్మిల చేస్తున్న ఆరోపణలు రాజకీయ పరిశీలకులను ఆకర్షిస్తున్నాయి. ప్రతీ విషయంలో జగన్ ను ఉద్దేశిస్తూ చేస్తున్న విమర్శల వెనక షర్మిల వ్యూహం ఏమిటా అని ఉత్కంఠగా గమనిస్తున్నారు.

అయితే ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన షర్మిల వైసీపీ పార్టీ పూర్తిగా పతనం అయితేనే కాంగ్రెస్ పార్టీకి ప్రయోజనం ఉంటుందని, అప్పుడే తన రాజకీయ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది అని షర్మిల బలంగా నమ్ముతున్నట్లు తెలుస్తుంది. ఎన్నికల ముందు చివరి నిమిషంలో ఏపీ రాజకీయాలలోకి రావడం మూలంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసురాలిగా జనం తనను గుర్తించలేదని, జగన్ కన్నా తానే బెటర్ అన్న నమ్మకాన్ని కలిగించాలి అన్న ఆలోచనలో షర్మిల ఉన్నట్లు తెలుస్తుంది.

వైసీపీ పార్టీలో ఉన్న నేతలు 90 శాతం పైగా కాంగ్రెస్ పార్టీ నుండి వెళ్లిన వారే. వారిలో విశ్వాసం కలిగించ గలిగితే వారంతా తన వెంట నడుస్తారని, 151 శాసనసభ స్థానాల నుండి 11 స్థానాలకు పడిపోయిన వైసీపీ పార్టీని, జగన్ ను ప్రజలు ఇక ఆదరించరు అన్న సంకేతాలు బలంగా పంపడమే లక్ష్యంగా ఓటమి తర్వాత కూడా షర్మిల అన్న మీద విమర్శలు ఎక్కుపెట్టినట్లు చెబుతున్నారు. మరి షర్మిల ఎత్తులు ఎంత వరకు ఫలిస్తాయో వేచిచూడాలి.