ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఒక వైపు ప్రభుత్వ కార్యక్రమాలు చూస్తూనే .. మరోవైపు వివిధ సందర్భాల్లో తనకు ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించడంలోనూ బిజీబిజీగా గడుపుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు శాసన సభా కార్యక్రమాలు ముగియడంతో ఎవరి పనుల్లోవారు వెళ్లిపోయారు. కానీ, డిప్యూటీ సీఎం మాత్రం.. తన చాంబర్‌కు వచ్చి.. ప్రజల నుంచి వచ్చిన గుట్టల కొద్దీ ఫిర్యాదులను పరిష్కరించే పనిలో పడ్డారు.
తన సిబ్బందిని పిలిపించి మరీ ఈ ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యకంగా దృష్టి పెట్టారు. కాగా, గతంలో ఐదుగురు డిప్యూటీ సిఎంలు ఉన్నాకూడా.. ఎవరూ ఇలా చొరవ తీసుకోలేకపోవడం.. ప్రజల సమస్యలు పరిష్కరించే ప్రయత్నం కూడా చేయకపోవడం గమనార్హం.
ఇవీ.. పరిష్కరించిన ఫిర్యాదులు..
- పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిసరఫరా, పర్యావరణం, అటవీ శాఖలపై వచ్చిన అర్జీలతోపాటు ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను, ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించారు.
- కొన్ని సంబంధిత శాఖల అధికారులకు పంపించడంతోపాటు, సమస్య తీవ్రతనుబట్టి అధికారులతో మాట్లాడి వాటి పరిష్కారినికి చర్యలు తీసుకున్నారు.
- తిరుపతి జిల్లా వెంకటగిరిలోని ఎన్టీఆర్ కాలనీ, 6వ వార్డుకు చెందిన మహిళలు, వృద్ధులను కొందరు యువకులు ముఠాలుగా ఏర్పడి వేధిస్తున్నారని వచ్చిన ఫిర్యాదుపై స్పందించారు. యువకులు కొందరు యువతుల ఫోటోలు తీసి ఇంటర్నెట్ లో పెట్టి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, మందు తాగి ఇళ్ల ముందు భారీ శబ్దాలు చేస్తూ పాటలుపెట్టడం, ఇళ్లపై రాళ్ళు వేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వచ్చిన ఫిర్యాదుపై ఎస్పీతో మాట్లాడి వెంటనే సదరు యువకులను పట్టుకునేలా చేశారు. వారిపై కేసులు పెట్టారు.
- కొందరు యువకులు ఓ మహిళా ఎస్సైను సైతం వేధించారని తెలియడంతో వెంటనే స్పందించి చర్యలు తీసుకున్నారు.
- మరికొందరు తమకు అర్హత ఉన్నా పింఛన్లు ఇవ్వడం లేదని అర్జీలు సమర్పించారు. వాటిని సంబంధిత సంక్షేమ శాఖకు పంపించారు.
- ఇంకొందరు.. విద్యుత్ సమస్యలపై ఫిర్యాదు చేయగా వాటిని కూడా సంబంధిత అధికారులకు పంపించారు. వెంటనే సమస్యలు పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు.