రాజగోపాల్ రెడ్డి : చేరికలకు చెక్ పెట్టడానికేనా ?!

“కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకున్నప్పుడు రూ.25 నుండి రూ.30 కోట్ల వరకు ఇచ్చారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న ఎమ్మెల్యేలకు కేవలం రూ.5 నుండి రూ.10 కోట్లు మాత్రమే ఇస్తున్నారు. అందుకే ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా 26 మంది ఎమ్మెల్యేలను చేర్చుకోవాలనుకున్నా ఇప్పటి వరకు 10 మంది ఎమ్మెల్యేలు మాత్రమే చేరారు” అంటూ శాసనసభ లాబీల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

ఈ అంశాన్ని అందిపుచ్చుకున్న బీజేపీ ఎంపీ రఘునందన్ రావు “కాంగ్రెస్ ఎమ్మెల్యేల కొనుగోళ్లకు తెరతీసిందని.. అనైతికంగా వ్యవహరిస్తోందంటూ” రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేపారు. అయితే ఈ అంశం పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు చికాకు తెప్పిస్తుందట. ఒకవైపు అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు స్పీకర్ కు ఫిర్యాదు చేయడమే కాకుండా, హైకోర్టులో కేసులు వేశారు. ఈ సమస్య నుండి ఎలా బయటపడాలని తాము అనుకుంటున్న సమయంలో రాజగోపాల్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారని వారు అంటున్నట్లు తెలుస్తుంది.

నియోజకవర్గం అభివృద్ధి కోసమే పార్టీ మారామని మేము చెప్పుకుంటూ వస్తున్నాం, కానీ రాజగోపాల్‌రెడ్డి మాత్రం 5, 10 కోట్లకు కొనుగోలు చేశామని చెప్పారు. తాము అమ్ముడుపోయినట్లు కోమటిరెడ్డి మాట్లాడటంపై పార్టీ మారిన ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ దృష్టికి ఈ వ్యాఖ్యలను తీసుకెళ్లినట్లు తెలుస్తుంది.

ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా కాంగ్రెస్ ప్రధానంగా 26 మంది ఎమ్మెల్యేలను చేర్చుకోవాలని భావించింది. అయితే ఇప్పటి వరకు 10 మంది మాత్రమే వచ్చారు. ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో ఉన్న 14 మంది ఎమ్మెల్యేలకు గాలం వేసినా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ లు మాత్రమే పార్టీలో చేరారు. ఉప ఎన్నికల్లో కంటోన్మెంట్ స్థానం గెలవడంతో మరో ఎమ్మెల్యే తోడయ్యాడు.

గద్వాల ఎమ్మెల్యే బండ్ల క్రిష్ణమోహన్ రెడ్డి, బాన్స్ వాడ ఎమ్మెల్యే పోచారం, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే వెంకట్రావులు మాత్రమే పార్టీలోకి వచ్చారు. తాజాగా కోమటిరెడ్డి వ్యాఖ్యలతో రావాలనుకున్న వారు కూడా వెనకడుగు వేస్తున్నారని తెలుస్తుంది. అసలు చేరికలను అడ్డుకోవడానికే రాజగోపాల్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశాడా ? అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి కొనుగోలు వ్యవహారం ఎక్కడికి వెళ్తుందో వేచిచూడాలి.