నమ్మండి.. జగన్ అంత అప్పు చేయలేదంట

వైసీపీ హ‌యాంలో చేసిన అప్పులు.. ప్ర‌స్తుతం చంద్ర బాబు ప్ర‌భుత్వం చెబుతున్న లెక్క‌ల వ్య‌వ‌హారానికి సంబంధించి మాజీ సీఎం , వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. తాజాగా గ‌ణాంకాల‌తో స‌హా వివ‌రాలు వెల్ల‌డించారు. తాము అధికారంలోకి వ‌చ్చేస‌రికి అప్ప‌టి చంద్ర‌బాబు ప్ర‌భుత్వం త‌మ‌కు రూ.100 కోట్లు మాత్ర‌మే ఖ‌జానా లో మిగిలించింద‌ని.. అయినా.. తాము భారీ స్థాయిలో అప్పులు చేయ‌కుండానే ప్ర‌భుత్వాన్ని ముందుకు న‌డిపించామ‌ని జ‌గ‌న్ చెప్పారు.

అయితే.. త‌మ‌పై ఎన్నిక‌ల స‌మ‌యంలో అభూత క‌ల్ప‌న‌ల‌తో త‌ప్పుడు ప్ర‌చారం చేయించార‌ని జ‌గ‌న్ విమ‌ర్శించారు. తమ ప్ర‌భుత్వం 14 ల‌క్ష‌ల్ కోట్ల రూపాయ‌లు అప్పులు చేసింద‌ని చంద్ర‌బాబు స‌హా అనేక మంది నాయ‌కులు చెప్పుకొచ్చార‌ని అన్నారు. కానీ, వాస్త‌వంగా మాత్రం తాము చేసింది.. 4 ల‌క్ష‌ల కోట్లేన‌ని తాజాగా వెల్ల‌డించిన ఆర్బీఐ నివేదిక కూడా స్ప‌ష్టం చేసింద‌న్నారు. అయినప్ప‌టికీ.. తాము చేసిన అప్పుల విష‌యాన్ని ప‌రిశీలిస్తే.. ఈ ఏడాది జూన్ 10వ తేదీ వ‌ర‌కు వేసుకున్నా.,. 5.7 ల‌క్ష‌ల కోట్లు దాట‌లేద‌న్నారు.

చంద్ర‌బాబు 2014లో అధికారం చేప‌ట్టే స‌మ‌యానికి 1.7 ల‌క్ష‌ల కోట్ల అప్పు ఉంద‌ని.. దానిని ఆయ‌న ఐదేళ్ల కాలంలో 3.27 ల‌క్ష‌ల కోట్లకు చేర్చార‌ని జ‌గ‌న్ చెప్పారు. త‌మ ఐదేళ్ల పాల‌న‌లో అన్ని ర‌కాల అప్పుల‌ను క‌లుపుకొన్నా.. 7 ల‌క్ష‌ల కోట్లకు మించ‌లేద‌న్నారు. వాస్త‌వానికి కేంద్ర ప్ర‌భుత్వం రాష్ట్రాలు అప్పులు చేసుకునేందుకు భారీ ఎత్తున వెసులుబాటు క‌ల్పించినా.. తాము వాడుకోలేద‌న్నారు. ఎఫ్ ఆర్‌బీఎం ప‌రిమితిని ఏనాడూ దాట‌కుండా.. జాగ్ర‌త్త‌గా అప్పులు చేసుకుంటూ వ‌చ్చామ‌ని వివ‌రించారు.

అయినా.. ఎన్నిక‌ల్లో గెలుపు కోసం..చంద్ర‌బాబు అబ‌ద్ధాలు చెప్పార‌ని.. ప్ర‌జ‌ల‌ను న‌మ్మించార‌ని జ‌గ‌న్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. చంద్రబాబు హయాంలో 21.63 శాతం దాకా అప్పు చేస్తే.. తాము 12.9 శాతం అప్పు చేశామ‌ని జ‌గ‌న్ వివ‌రించారు. ఆర్థిక స‌ర్వే సైతం వైసీపీ పాన‌ల‌ను మెచ్చుకుంద‌నిజ‌గ‌న్ పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా ప‌లు ఆధారాల‌ను ఆయ‌న ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ద్వారా వివ‌రించారు. దీనిని ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లాల‌ని ఆయ‌న మీడియాను అభ్య‌ర్థించారు.