వైసీపీకి భారీ దెబ్బ‌.. కీల‌క నేత రాజీనామా?

ఏపీ విప‌క్ష పార్టీ వైసీపీకి వ‌రుస దెబ్బ‌లు త‌గులు తున్నాయి. పార్టీ ఇప్పుడు క్లిష్ట ప‌రిస్థితిలో ఉన్న‌స‌మ‌యం ఆదుకోవాల్సిన నాయ‌కులు ఒక్కొక్క‌రుగా పార్టీని వీడుతున్నారు. రెండు రోజుల కింద‌ట గుంటూరుకు చెందిన మాజీ ఎమ్మెల్యే మ‌ద్దాలి గిరి పార్టీ రాజీనామా చేశారు. వాస్త‌వానికి ఆయ‌న 2019లో టీడీపీ త‌ర‌ఫున విజ‌యం ద‌క్కించుకుని వైసీపీలోకి వ‌చ్చారు. ఈ ద‌ఫా ఆయ‌న‌కు టికెట్ ఇవ్వ‌క‌పోయినా.. వైసీపీ ప్ర‌బుత్వ ఆయ‌న‌కు భారీగానే కాంట్రాక్టులు ఇచ్చింది. వ్యాపారాల‌ను కూడా ప్రోత్స‌హించింది.

కానీ, ఆయ‌న ప్ర‌భుత్వ ప‌డిపోగానే.. పార్టీకి దూరంగా ఉన్నారు. రెండు రోజుల కింద‌ట రాజీనామా చేశారు. ఈ ప‌రంప‌రంలో ఇప్పుడు కీల‌క నాయ‌కుడు.. మండ‌లిలో వైసీపీ ప‌క్ష నేత‌ ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వ‌ర్లు అల్లుడు.. పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోశ‌య్య వైసీపీకి రాజీనామా చేశారు. ఈ మేర‌కు ఆయ‌న పార్టీ అధిష్టానానికి రాజీనామా లేఖ‌ను పంపించారు. ఈ ఎన్నిక‌ల్లో ఆయ‌న కోరుకున్న‌ట్టుగానే గుంటూరు ఎంపీ టికెట్ ను వైసీపీ అధినేత ఇచ్చారు.

అయితే.. వైసీపీ వ్య‌తిరేక ప‌వ‌నాల్లో ఎంతో మంది ఉద్ధండులు కొట్టుకుపోయారు. ఈ క్ర‌మంలోనే కిలారి రోశ‌య్య కూడా ఓడిపోయారు. అయిన‌ప్ప‌టికీ.. పార్టీలో ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌ద‌విని ఇచ్చేందుకు జ‌గ‌న్ ఇటీవ‌ల సిద్ధ‌మ‌య్యారు. దీనిని తీసుకునేందుకు అప్ప‌ట్లోనే విముఖ‌త వ్య‌క్తం చేయ‌డంతో.. జ‌గ‌న్ మౌనంగా ఉన్నారు. కాగా, తాజాగా ఆయ‌న పార్టీకి రాజీనామా చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించి.. బాంబు పేల్చారు. ఫ‌లితంగా గుంటూరులో బ‌ల‌మైన కాపు సామాజిక వ‌ర్గంలో నాయ‌కుడు పార్టీకి దూర‌మైన‌ట్టు అయింది.

అదికూడా.. రాష్ట్రంలో ముఖ్యంగా అదే గుంటూరు జిల్లాలోని వినుకొండ‌లో జ‌రిగిన దారుణ హ‌త్య నేప‌థ్యంలో జ‌గ‌న్ ఢిల్లీలో ధ‌ర్నా చేస్తున్న స‌మ‌యంలోనే.. రోశ‌య్య పార్టీకి రాజీనామా చేయ‌డం గ‌మ‌నార్హం. నిజానికి ఈయ‌న‌కు కూడా ఢిల్లీకి రావాలంటూ.. వైసీపీ నుంచి ఆహ్వానం అందింది. వ‌స్తాన‌ని కూడా చెప్పిన‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. కానీ..అటు వెళ్ల‌కుండా.. ఇటు రాజీనామా స‌మ‌ర్పించ‌డం గ‌మ‌నార్హం. మున్ముందు ఇంకెంత మంది జ‌గ‌న్ హ్యాండిస్తారో చూడాలి.