ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ సహనానికి పరీక్ష ఎదురు కానుంది. రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. ఈ నెల 23వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. 25న బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. ఆగస్టు-మార్చి-2025 వరకు ఏడు మాసాల కాలానికి మధ్యంతర(ఇంటీరియం) బడ్జెట్‌ను ప్రవేశ పెట్టేందుకు చంద్రబాబు సర్కారు రెడీ అయింది. అయితే.. ప్రభుత్వం పక్షం పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ.. అధికారం కోల్పోయి.. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కని వైసీపీ పరిస్థితిపైనా.. ముఖ్యంగా ఆ పార్టీ అధినేత జగన్ వ్యవహార శైలిపైనా రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
వాస్తవానికి ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం.. జగన్ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి లేఖ రాశారు. ఇది జరిగి మూడు వారాలైనా స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రజలే ప్రతిపక్ష హోదా ఇవ్వనప్పుడు తామెలా ఇస్తామని మంత్రులు ఒకరిద్దరు వ్యాఖ్యానించా రు. ఇక, సీఎం చంద్రబాబు ఈ విషయంలో చాలా వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలో సభకు హాజరయ్యే విషయంలో వైసీపీ డోలాయమానంలో పడినా.. మేధావుల సూచనల మేరకు.. సభకు హాజరవ్వాలనే నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. అయితే.. 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్న వైసీపీ పరిస్థితి సభలో ఎలా ఉంటుంది? మాట్లాడేందుకు అవకాశం ఉంటుందా? ఉండదా? అనేది సందేహాలు.
సహజంగా సభాపతి స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తిపైనే ఈ నిర్ణయం ఆధారపడి ఉంటుంది. స్పీకర్ తీసుకునే నిర్ణయమే అంతిమంగా విపక్షానికి అవకాశం వచ్చేలా చేస్తుంది. సంఖ్యాబలం ఉన్నా.. మైకు ఇవ్వని సందర్భాలు అనేకం ఉన్నాయి. సంఖ్యా బలం లేకపోయినా.. మాట్లాడే సబ్జెక్టు ఆధారంగా మైకు తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒక గంట సమయాన్ని స్పీకర్ వెచ్చించాలని అనుకుంటే.. దీనిలో 50 నిమిషాల పాటు.. అధికార పార్టీకే ఇస్తారు. చివరి 10 నిమిషాలు మాత్రమే ఇప్పుడున్న పరిస్థితిలో (11 మంది సభ్యులు) వైసీపీకి దక్కే అవకాశం ఉంటుంది. అది కూడా.. సభలో అందరూ మాట్లాడడం అయిపోయిన తర్వాతే!
అయితే.. అప్పటి వరకు జగన్ వేచి ఉండాలా? అంటే.. తప్పదు! ఓపిక, సహనం వంటివి ఇప్పుడు జగన్‌కు అవసరం. సమయం ఇచ్చే వరకు వేచి ఉండాలి. ఒక్కొక్కసారి సమయం చిక్కకపోయినా.. మాట్లాడుతున్న రెండు నిమిషాల్లోనే మైకు కట్ చేసినా.. భరించాలి. అలాకాదు.. సభకు వెళ్లనని అంటే.. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్నారని.. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించలేకపోతున్నారనే వాదన బయలుదేరుతుంది. సో.. ఎలా చూసుకున్నా.. సభకు వెళ్లాల్సిందే.. సహనంతో వ్యవహరించా ల్సిందే. అప్పుడే.. ఎంతో కొంత సింపతీ అయినా ఏర్పడుతుంది. లేకపోతే.. అసలు నాయకుడిగా కూడా.. ఆయన పనిచేస్తారా? అనే చర్చ వచ్చినా ఆశ్చర్యం లేదు. ఎలా చూసుకున్నా.. జగన్ కు ఇప్పటికిప్పుడు కావాల్సింది.. వ్యూహంతోపాటు సహనం. సంయమనం!! మరి ఏం చేస్తారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates