తన దాకా వస్తే కానీ.. నొప్పి తెలియదని సామెత. ఇప్పుడు వైసీపీ అధినేత జగన్, ఆయన పరివారం విషయంలో ఇదే జరుగు తోంది. తమ వరకు పోలీసులు, కేసులు, కోర్టులు వస్తే తప్ప.. వారికి తత్వం బోధపడలేదు. ఇప్పుడు వ్యవస్థల గురించి, ఉద్యోగు ల గురించి, న్యాయం, ధర్మం, రూల్సూ.. ఇలా ఎన్నుంటే అన్నీ గుర్తుకు వస్తున్నాయి. అయితే.. ఇవి ఎప్పుడూ ఉంటాయి. కానీ, తమ హయాంలో వీటిని పాటించారా? అన్నది ప్రశ్న. అప్పట్లో అన్నింటినీ తుంగలో తొక్కి.. తాము చెప్పిందే న్యాయం.. తాము చేసిందే చట్టం అన్నట్టుగా చెలరేగిపోలేదా? అన్నది రాజకీయాలకు తటస్థంగా ఉండే వారు కూడా సంధిస్తున్న ప్రశ్న.
తాజాగా.. వైసీపీ హయాంలో అదనపు అడ్వొకేట్ జనరల్‌గా పనిచేసిన పొన్నవోలు సుధాకర్ మీడియాతో మాట్లాడారు. వైసీపీ మాజీ ఎంపీ, ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు.. తనపై హత్యాయత్నం జరిగిందంటూ.. గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసింందే. దీంతో జగన్‌ను ఏ-3గా పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ పరిణామంపై పొన్నవోలు స్పందిస్తూ.. “ఇది వ్యవస్థలకు మంచిది కాదు. ఉద్యోగులు సక్రమంగా పనిచేయలేరు” అని వ్యాఖ్యానించారు. నిజమే కావొచ్చు. కానీ, ఏ వ్యవస్థ అయినా.. గతంలో ఉన్నదే. ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. మరి అప్పట్లో ఇదే వ్యవస్థలను భ్రష్టు పట్టించలేదా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
గతంలో జగన్ హయాంలో వ్యవస్థలను ఎంతగా భ్రష్టు పట్టించారనేది రాసుకుంటే రామాయణమంత.. చెప్పుకొంటే భారతమంత!! ఇవన్నీ పొన్నవోలు సార్ మరిచిపోయారా? లేక మరిచిపోయినట్టు నటిస్తున్నారా? ఇతర విధ్వంసాలను పక్కన పెడితే.. మాజీ ముఖ్యమంత్రి(అప్పటి) చంద్రబాబును విశాఖ విమానాశ్రయం దాటి బయటకు కాలు కూడా పెట్టనివ్వని పరిస్థితిని ఏమంటారు? ఆయనను నంద్యాల శివారు అరెస్టు చేసినప్పుడు ఈ వ్యవస్థలు ఏమయ్యాయి? ఈ మంచితనం ఏమైంది? ఆయనను 53 రోజుల పాటు జైల్లో పెట్టినప్పుడు.. వ్యవస్థలను భ్రష్టు పట్టించినట్టు కాదా? అంతెందుకు.. .జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను విశాఖపట్నంలో హోటల్ నుంచి బయటకు కూడా రాకుండా.. పహారా పెట్టినప్పుడు ఈ వ్యవస్థలను ఏం చేసినట్టు?
పోనీ.. ఇవన్నీ వదిలేద్దాం.. వాళ్ల ఖర్మ అనుకుందాం.. మరి.. సొంత చెల్లెలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు.. షర్మిలను విజయవాడ లో నడిరోడ్డుపై బెదిరించినప్పుడు.. ఈ వ్యవస్థలను భ్రష్టుపట్టించినట్టు కాదా? నిరసన తెలిపే హక్కుకూడా లేకుండా షర్మిల నోరు మూయించి.. ఆమెకు ఆంధ్రరత్న భవన్‌కే పరిమితం చేసినప్పుడు.. పొన్నవోలు ఎందుకు స్పందించలేదు. సామాన్యుల సంగతి చెప్పుకొంటే.. ఒక పెద్ద పుస్తకమే రాయొచ్చు. అధికారంలో ఉన్నప్పుడు విర్రవీగి.. కోల్పోయిన తర్వాత.. వ్యవస్థలను గుర్తు చేసుకుంటే ప్రయోజనం ఉంటుందా? అనేది విజ్ఞుడైన పొన్నవోలు ఆలోచించుకోవాలంటున్నారు.. ఇక, చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేసి బెయిల్ తెచ్చుకున్నారని నోరు చేసుకున్న జోగి రమేష్ నుంచి ఇతర నాయకుల వరకు అందరూ ఇప్పుడు చేస్తున్నది బెయిల్ జపం కాదా? ఏదేమైనా.. తనదాకా వస్తే.. నొప్పి తెలుస్తుందన్న సామెతను వైసీపీ నాయకులు గుర్తు చేసుకుంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates