2019 సార్వత్రిక ఎన్నికలు ఏపీ చరిత్రలో నిలిచిపోతాయనడంలో ఎటువంటి సందేహం లేదు. 151 సీట్ల భారీ మెజారిటీతో ఏపీ సీఎంగా వైఎస్ జగన్ పగ్గాలు చేపట్టారు. దీనికితోడు, కేంద్రంలో బీజేపీతో సత్సంబంధాలు…పొరుగు రాష్ట్రం అయిన తెలంగాణ ప్రభుత్వంతో స్నేహం కొనసాగిస్తూ జగన్ ఏపీలో పాలనను కొనసాగిస్తున్నారు. చంద్రబాబుపై గుర్రుగా ఉన్న ప్రధాని మోడీ, బీజేపీ పెద్దలు సైతం జగన్ కు సపోర్ట్ చేశారు. ఇదే ఊపులో జగన్ తనకు కావాల్సిన ఐఏఎస్, ఐపీఎస్ లను రాష్ట్రానికి తెప్పించుకోవాలని ప్రయత్నించారు. కేంద్రంతో దోస్తీ కారణంగా అది పెద్ద విషయం కాదని అంతా అనుకున్నారు. అయితే, అనూహ్యంగా జగన్ అనుకున్న నిర్ణయాలకు కేేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి, ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్రలను ఏపీకి రప్పించుకునేందుకు కేంద్రంతో జగన్ సంప్రదింపులు జరిపినా పని కాలేదు. అదే సమయంలో జగన్ పక్కనబెట్టేయాలనుకున్న వారికి మాత్రం కేంద్రం అవకాశాలు కల్పిస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. హోం మంత్రి అమిత్ షాకు కోపం వచ్చేలా ఓ అధికారికి జగన్ కీలకమైన పదవి ఇవ్వడం వల్లే జగన్ కోరికలు నెరవేరడం లేదని ప్రచారం జరుగుతోంది.
ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి ఏపీకి వెళతానంటూ విజయసాయిరెడ్డి ద్వారా చాలాకాలంగా కేంద్ర పెద్దలతో రాయబారం నడుపుతున్నారు. అదే విధంగా డిప్యుటేషన్ పై స్టీఫెన్ రవీంద్ర కూడా ఏపీకి వెళ్లేందుకు రెడీగా ఉన్నారు. అయితే, వీరిద్దరికీ క్లియరెన్స్ మాత్రం రాలేదు. కర్నాటక కేడర్ అధికారి శ్రీవత్స, రోహిణి సింధూరి విషయంలోనూ జగన్ కు చుక్కెదురైంది. అదే సమయంలో ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిశోర్‌పై ఏపీ సర్కారు కేసు పెట్టింది. ఆయన క్యాట్ ను ఆశ్రయించడంతో జగన్ తీరును కేంద్రం తప్పుపట్టింది. అంతేకాదు, కృష్ణకిశోర్‌కు ఏకంగా ప్రమోషన్ ఇచ్చి మరీ ఢిల్లీలో పోస్టింగ్ ఇచ్చింది. ఇక, టీటీడీ జేఈవోగా పనిచేసే శ్రీనివాసరాజు కూడా అర్జీ పెట్టుకోగానే తెలంగాణకు మూడేళ్ల డిప్యూటేషన్ ఇచ్చేసింది కేంద్రం. ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కూడా క్లీన్ చిట్ కోసం ఎదురుచూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.
వీటన్నింటిక కారణం షాను హర్ట్ చేయడమేనని టాక్ వస్తోంది. గతంలో సీబీఐ అధికారులు కేసులు పెట్టుకున్న విషయంలో మనీశ్ కుమార్ సిన్హా అనే ఐపీఎస్ అధికారి కేంద్ర బిందువుగా మారారు. ఆయన సుప్రీంకు సమర్పించిన లేఖతో తన సన్నిహితుడైన ఆస్తానాను షా తప్పక పక్కన పెట్టాల్సి వచ్చిందట. అయితే, షాకు శత్రువుగా మారిన మనీష్ కు ఏకంగా ఇంటలిజెన్స్ చీఫ్ పదవినిచ్చారు సీఎం జగన్. దీంతో.. అమిత్ షా హర్ట్ అయ్యారని, ఆ ఎఫెక్ట్ జగన్ మీద పడుతోందని విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. నిమ్మగడ్డ లేఖ విషయంలోనూ కేంద్రం భద్రతను ఏర్పాటు చేయడం…మండలి రద్దు నిర్ణయంలో జాప్యం జరగడం వంటి పరిణామాలకు ఇదే కారణమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే, జగన్ కోరుకున్న వారిని ఏపీకి పంపడం లేదని టాక్ వినిపిస్తోంది. మరి, ఈ విషయంలో వాస్తవాలెంత అన్నది తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడక తప్పదు.