రేవంత్ రెడ్డి ‘ఆప‌రేష‌న్‌’… బీఆర్ఎస్ ప‌రేషాన్‌!

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి త‌న ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌ను కొన‌సాగిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేస్తా.. అంటూ కొన్ని రోజుల కింద‌ట ఆయ‌న వ్యాఖ్యానించారు. ఈ క్ర‌మంలో బీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున వ‌ల‌స‌ల‌ను ప్రోత్స‌హిస్తున్నారు. ఇప్ప‌టికే ప‌లువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఆయ‌న త‌న పార్టీ లో చేర్చుకున్నారు. అయితే.. ఇలా చేర్చుకోవ‌డంపై విమ‌ర్శ‌ల మాట ఎలా ఉన్నా.. ప్రధాన ప్ర‌తిపక్షం బీఆర్ఎస్ నుంచి మాత్రం సూటి పోటి మాట‌లు ఎదుర‌వుతూనే ఉన్నాయి.

అయిన‌ప్ప‌టికీ.. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్న వారి సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది. బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేస్తామ‌ని.. కేసీఆర్‌కు ముందుంది..ముస‌ళ్ల పండ‌గ అని రేవంత్ వ్యాఖ్యానించిన విష‌యం తెలిసిందే. దీనికి ఊతం ఇస్తున్న‌ట్టుగా.. తాజాగా సీఎం నివాసంలో ప్రకాష్ గౌడ్ తో పాటు మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్లు, ఇతర నేతల చేరికలపై చ‌ర్చించారు. సాధ్య‌మైనంత వేగంగా.. ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌ను వేగం పెంచాల‌ని నిర్ణ‌యించారు.

ఈ నేప‌థ్యంలో సిఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ గూటికి బిఅర్ఎస్ పార్టి ఎమ్మెల్యేలు కె.పి వివేకానంద గౌడ్, అరికపూడి గాంధీ, మాధవరం కృష్ణా రావు, బండారి.లక్ష్మారెడ్డి, దేవిరెడ్డి సుధీర్ రెడ్డిలు చేరేందుకు మార్గం సుగ‌మ‌మైంది. మొత్తంగా వ‌చ్చే నెల 15న రైతు బంధు నిధులు విడుద‌ల చేసే లోగా.. మెజారిటీ నాయ‌కుల‌ను తీసుకునే ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు. త‌ద్వారా.. బీఆర్ఎస్‌ను డైల్యూట్ చేసి.. అనంత‌రం స్థానిక ఎన్నిక‌ల‌కు వెళ్లే వ్యూహంతో ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది.

ఈ ప‌రిణామాల‌పై తాజాగా బీఆర్ఎస్ ముఖ్య నేత కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. ఎంత మంది పోయినా త‌మకు ఇబ్బంది లేద‌న్నారు. కొత్త నాయ‌కుల‌ను సృష్టించుకుంటామ‌ని చెప్పారు. అయితే..ఇక్క‌డే కొంత వెను క‌డుగు క‌నిపించింది. ఎలాగంటే.. ఇంత మంది ఒకే సారి క‌ట్ట‌గ‌ట్టుకుని పార్టీకి దూర‌మ‌వుతున్న నేప‌థ్యం లో “ఇలా ఎందుకు జ‌రుగుతోంది?” అని ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌నార్హం. ఎలా చూసుకున్నా.. ఫ‌స్ట్ టైమ్ మాత్రం కేటీఆర్ స్వ‌రంలో కొంత పరేషాన్ అయితే.. క‌నిపించింది.