మాజీ మంత్రి వ‌ర్సెస్ మ‌హిళా ఎమ్మెల్యే.. కోర్టులో కేసు

అధికారం ఉంద‌నే అహంకారంతో జ‌గ‌న్ అండ్ కో చేసిన అరాచ‌కాలకు జ‌నం ఓటుతో బుద్ధి చెప్పారు. ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వైసీపీని పాతాళానికి తొక్కారు. అధికారంలో ఉన్న‌ప్పుడు వైసీపీ నాయ‌కులు కూడా రెచ్చిపోయారు. ప్ర‌త్య‌ర్థి పార్టీల నేత‌ల‌ను ల‌క్ష్యంగా చేసుకుని దాడులు, అస‌భ్య‌క‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఇప్పుడు వాట‌న్నింటికీ వైసీపీ నాయ‌కులు మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌ని ప‌రిస్థితులు క‌లుగుతున్నాయి. తాజాగా వైసీపీ నేత‌, మాజీ మంత్రి సీద‌రి అప్ప‌ల‌రాజును వ‌దిలేదే లేద‌ని టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీష న్యాయ పోరాటానికి దిగ‌డం హాట్ టాపిక్‌గా మారింది.

గ‌తంలో సీద‌రి అప్ప‌ల‌రాజు మంత్రిగా ఉన్న‌ప్పుడు ప్ర‌త్యేకంగా 20 మందిని పెట్టి మ‌రీ త‌న‌పైనా, తన తండ్రిపైనా అస‌భ్య‌క‌రంగా మాట్లాడించార‌న్న‌ది శిరీష ప్ర‌ధాన ఆరోప‌ణ‌. త‌న కుటుంబం జోలికి రావ‌డంతో ఈ విష‌యాన్ని చాలా సీరియ‌స్‌గా తీసుకున్నాన‌ని ఆమె చెబుతున్నారు. అందుకే కోర్టును ఆశ్ర‌యించారు. విశాఖ కోర్టులో అప్ప‌ల‌రాజుపై దావా వేశారు. దిగ‌జారుడు వ్యాఖ్య‌లు చేసిన వాళ్ల‌పై కఠిన చ‌ర్య‌లు తీసుకోవాల్సిందేన‌న్నారు. గ‌త అయిదేళ్ల‌లో టీడీపీ మ‌హిళా నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల మీద సోష‌ల్ మీడియాలో అస‌భ్య‌క‌ర పోస్టులు పెట్టి దారుణంగా అవ‌మానించార‌ని శిరీష పేర్కొన్నారు.

రాజ‌కీయ విమ‌ర్శ‌లు హుందాగా ఉండాలి. అధికారంలో ఉన్న పార్టీని ప్ర‌తిప‌క్షాలు ప్ర‌శ్నిస్తాయి. అభివృద్ధి చేయ‌క‌పోతే నిల‌దీస్తాయి. అవినీతికి పాల్ప‌డితే పోరాడ‌తాయి. అలా అని అధికారం ఉంద‌ని ప్ర‌త్య‌ర్థి పార్టీల‌పై క‌క్ష క‌ట్ట‌డం స‌రికాదు. ప్ర‌త్య‌ర్థి పార్టీ నాయ‌కులే ల‌క్ష్యంగా భౌతిక‌, మాన‌సిక దాడులు చేయ‌కూడ‌దు. కానీ ఈ విష‌యం మ‌రిచిన వైసీపీ గ‌త అయిదేళ్ల‌లో ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రించింది. ఇప్పుడు కూట‌మి అధికారంలోకి రావ‌డంతో అలా త‌ప్పుడు మాట‌లు మాట్లాడిన వాళ్ల‌పై, అవినీతికి పాల్ప‌డ్డ వాళ్ల‌పై చ‌ర్య‌లు తీసుకునే దిశ‌గా ప్ర‌భుత్వం క‌స‌ర‌త్తులు చేస్తోంది.