సార్వత్రిక ఎన్నికల సమరంలో వైసీపీ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. 151 సీట్లతో 2019లో ఎవరూ ఊహించని ఘన విజయం సొంతం చేసుకున్న జగన్.. 2024కు వచ్చే సరికి కేవలం 11 స్థానాలకు సరిపుచ్చుకుని.. ఇప్పుడు కూడా.. ఎవరూ ఊహించని విధంగా నేల మట్టమయ్యారు. దీనికి కారణం ఎవరు? ఎలా ? అనేది పార్టీ నాయకులు ఇంకా ఆత్మపరిశీలన చేసుకుంటూనే ఉన్నారు. ఎవరి మీద దీనిని తోసేయాలన్నా.. కుదరడం లేదు. మొదట్లో ఐఏఎస్ ధనుంజయరెడ్డి కారణమని చెప్పినా.. దానిలో పసలేకుండా పోయింది.
తర్వాత వలంటీర్లపై నెట్టే ప్రయత్నం చేశారు. కానీ, ఇది కూడా వర్కవుట్ కాలేదు. ఇక, కొన్ని చట్టాలు కారణమంటూ.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను బూచిగా చూపించారు. కానీ, వీటిని మించిన తప్పులు జరిగా యన్నది అందరికీ తెలుసు. కానీ, ఎవరూ నోరు విప్పేందుకు సాహసించలేదు. అయితే.. రోజులు గడుస్తున్న కొద్దీ నాయకులు నోరు విప్పుతున్నారు. తప్పులపై సమీక్షలు చేసుకుంటున్నారు. కీలక తప్పులు.. రాంగు స్టెప్పులపై ఆలోచన చేస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. వైసీపీ ఘోర పరాజయానికి కారణాల్లో అత్యంత కీలకమైన కారణం జనసేనను, ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ను కెలకడమేనని చెప్పుకొచ్చారు. ఇది.. యువత ఓటు బ్యాంకును తమకు దూరం చేసిందన్నారు. ఇదేసమయంలో సినీ రంగాన్ని కూడా వైసీపీకి దూరం చేసిందన్నారు. ఇలా చేయకుండా ఉండాల్సిందని ఆయన పశ్చాత్తాప పడ్డారు. అయితే.. ఇప్పుడు చేతులు కాలిపోయాయి. మరి ఇక ముందైనా.. జాగ్రత్తగా వ్యవహరిస్తారేమో చూడాలి.
ఎలా కెలికారంటే..
- జనసేనను టీడీపీతో కలవకుండా చేయాలన్నది ప్రధానంగా రెండు సంవత్సరాలు వైసీపీ చేసింది. అనేక సందర్బాల్లో ‘దమ్ముంటే’ ఒంటరిగా రావాలంటూ.. సవాళ్లు రువ్వింది. కానీ, అంతః సూత్రాన్ని విస్మరించింది. ఇక్కడ పవన్ దమ్మును ప్రశ్నిస్తున్నామని.. ఆయన అభిమానులు రియాక్ట్ అయితే.. పరిస్థితి ఎలా ఉంటుందని అంచనా వేసుకోలేక పోయింది.
- పవన్ కల్యాణ్.. మూడు పెళ్లిళ్ల వ్యవహారాన్ని నేరుగా జగనే ప్రస్తావించారు. ఎక్కడ సభ పెట్టినా.. ఏడాదిన్నర పాటు ఆయన మూడు పెళ్లిళ్ల చుట్టూ రాజకీయాలు తిప్పారు. అయితే.. ఆయన ఉద్దేశం వేరే అయినా.. పవన్ విషయంలో దీనిని వ్యతిరేకంగా ఆయన అభిమానులు. ఓ వర్గం ప్రజలు చూడలేక పోతున్నారన్న వాదనను వైసీపీ గుర్తించలేకపోయింది.
- కేడరే లేదు.. కార్యకర్తలే లేరు.. అంటూ.. జనసేన పై విమర్శలు గుప్పించిన వైసీపీ.. ఆయనకు ఉన్న అభిమానులను లెక్కలోకి తీసుకోలేక పోయింది. 2019లో ఒంటరిగా పోటీ చేసినప్పుడే.. 30 వేల నుంచి 50 వేల వరకు మెజారిటీ స్థానాల్లో ఓట్లు దక్కించుకున్న విషయాన్ని గమనించలేక పోవడం కూడా.. పెద్ద తప్పు.
- పవన్ కేవలం తురుపుముక్క మాత్రమేనని.. ఆయననే ఓడిస్తామని.. శపథాలు చేయడం, కాపులను దూరంగా ఉంచాలన్న కుట్రలకు పాల్పడడం వంటివి కూడా.. జనసేన ఐక్యతను.. పవన్ ఇమేజ్‌ను పెంచుతున్నామన్న స్పృహను వైసీపీ గుర్తించలేక పోవడం మరింత పొరపాటు.
- పవన్ లేవనెత్తిన అనేక సమస్యలను.. కూడా.. సిల్లీగా తీసుకున్నారు. వారాహి యాత్రను అడ్డుకునే ప్రయత్నం చేశారు. వలంటీర్ల విషయాన్ని అడ్డు పెట్టుకుని దుయ్యబట్టారు. ఇవన్నీ.. జనసేన ను ఏకతాటిపైకి వచ్చేలా చేశాయనడంలో సందేహం లేదు. కేతిరెడ్డి ఇప్పుడు గుర్తించినా.. మిగిలినా.. నాయకులు కూడా గుర్తించాల్సి ఉంటుంది.