జ‌గ‌న్‌కు షాక్‌: హైదరాబాద్ లోటస్‍పాండ్‍లో కూల్చివేతలు

ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వం కుప్ప‌కూలిన ద‌రిమిలా.. ఇంకా ఆ షాక్ నుంచి పార్టీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ తేరుకోలేదు. ఇంకా లెక్క‌లు వేసుకుంటూనే ఉన్నారు. ఎలా ఓడిపోయామా? అని సందేహాలు వ్య‌క్తం చేస్తూ నే ఉన్నారు. అంతేకాదు.. నాయ‌కుల‌ను కూర్చోబెట్టుకుని త‌న ఆశ్చ‌ర్యాన్ని, దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేస్తూనే ఉన్నారు. అయితే.. ఈ షాక్ నుంచే ఇంకా తేర‌కోని జ‌గ‌న్‌కు ఇప్పుడు మ‌రో భారీ షాక్ త‌గిలింది. ఆయ‌న‌కు హైద‌రాబాద్‌లో ఉన్న ఇల్లు, పార్టీ కార్యాల‌యంలో కూల్చి వేత‌లు జ‌రుగుతున్నాయి.

హైద‌రాబాద్‌లోని లోట‌స్ పాండ్‌లో ఉన్న‌ జగన్ నివాసంలో అక్రమ నిర్మాణాలను జీహెచ్‍ఎంసీ సిబ్బంది తొల‌గించ‌డం ప్రారంభించారు. కార్యాల‌య నిర్మాణంలో భాగంగా రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వాటిని అధికారులు ద‌గ్గ‌రుండి మ‌రీ కూల్చి వేయిస్తున్నారు. ప‌లు జేసీబీల‌ను రంగంలోకి దించిన హైద‌రాబాద్ మెట్రో కార్పొరేష‌న్ అధికారులు పోలీసుల స‌హ‌కారంతో అక్ర‌మంగా నిర్మించిన ప‌లు నిర్మాణాలు కూల్చి వేయిస్తున్నారు.

కూల్చి వేస్తున్న వాటిలో ఫుట్‍పాత్ ల‌ను ఆక్రమించి నిర్మించిన‌ సెక్యూరిటీ పోస్ట్ లు, భారీ ఎత్తున నిర్మించి న హోర్డింగులు, ప్ర‌హ‌రీ గోడ‌లు.. వాహ‌నాల పార్కింగులు(టూ వీల‌ర్‌) ఉన్నాయి. లోటస్‍పాండ్ చుట్టూ అక్ర‌మంగా ఆక్ర‌మించి చేప‌ట్టిన నిర్మాణాల‌పై స్థానికులు ఫిర్యాదులు చేయ‌డంతో అధికారులు స్పందిం చారు. గ‌త నెల‌లోనే కార్యాల‌య అధికారుల‌ను నోటీసులు ఇచ్చిన‌ట్టు తెలిసింది. అయితే వారు స్పందించ‌లేదు. దీంతో ఇప్పుడు నేరుగా అధికారులు రంగంలోకి దిగి కూల్చి వేత‌లు చేప‌ట్టారు.

అయితే..ఇ దే కార్యాల‌యంలో వెనుక‌వైపు పీసీసీ చీఫ్ ష‌ర్మిల కార్యాల‌యం కూడా ఉంది. మ‌రి దాని వైపు అధికారులు చూస్తారా? లేక వ‌దిలేస్తారా? అనేది తెలియాల్సి ఉంది. ప్ర‌స్తుతం వైసీపీకి చెందిన కార్యాల యం ఎదురుగా ఉన్న క‌ట్ట‌డాల‌ను మాత్ర‌మే అధికారులు కూల్చి వేస్తున్నారు. ఎలాంటి ఆందోళ‌న‌ల‌ను నిర్వ‌హించ‌కుండా.. పోలీసుల‌ను కూడా రంగంలోకి దింపారు. ప్ర‌స్తుతం ఈ దారిని మూసివేశారు.