సవాళ్ల వలయంలో పదవీ ప్రమాణం

అయిదేళ్ళుగా వైసిపి ప్రభుత్వ పాలనతో విసిగి వేసారిన ప్రజానీకం కోరుకున్న క్షణం వచ్చేసింది. నాలుగు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ అనుభవమున్న నాయకుడు కావాలనే సంకల్పంతో టిడిపి జనసేన బిజెపి కూటమికి భారీ మద్దతు తెలుపడంతో ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు అనే నేను మాటను కోట్లాది ప్రజలు ప్రత్యక్షంగా చూసి వినే అవకాశం దక్కింది.

ఎన్నికల ప్రచారంలో అలుపే తెలియని రీతిలో అహోరాత్రాలు చంద్రబాబు పడిన కష్టానికి, కన్న కలకు ఇవాళ సాక్షాత్కారం దొరికింది. ప్రధాని నరేంద్రమోడీ సహా దిగ్గజ నాయకులెందరో సాక్షులుగా మహోన్నత ఘట్టం ఆవిష్కృతమయ్యింది.

గవర్నర్ ద్వారా ప్రమాణ స్వీకారం చేస్తున్నంత సేపూ సభకు విచ్చేసిన అభిమానులు, కార్యకర్తలు తమ కరతాళధ్వనులతో హర్షాతిరేకం తెలుపుతూనే ఉన్నారు. కక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూనే తప్పు చేసిన వాళ్ళను వదిలి పెట్టనని చెబుతున్న చంద్రబాబు రాజధాని అమరావతే ఉంటుందని చెప్పడం ద్వారా ప్రజా భీష్ఠానికి అనుగుణంగా తమ పాలన ఉంటుందని నిన్నే చెప్పిన సంగతి తెలిసిందే.

శాసన సభను గౌరవ సభగా చూడాలన్న సంకల్పంతో ఇకపై అభివృద్ధి వైపు అడుగులు వేసే దిశగా ప్రతి కార్యక్రమం జరుగుతుందని స్పష్టం చేయడం పార్టీ శ్రేణులకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది.

నిన్నటి సమావేశంలో చంద్రబాబు చెప్పినట్టు ఇకపై ఎన్నో సవాళ్లు స్వాగతం చెప్పబోతున్నాయి. ఆర్థిక లోటు, అప్పులు, క్రమ శిక్షణ తప్పిన బడ్జెట్, వ్యవస్థలు అధోగతి పాలు కావడం లాంటివెన్నో సరిచేయాల్సిన బాధ్యత ఉంది.

గతంలో మూడుసార్లు పాలన అందించినప్పటికీ ఎప్పుడూ లేనంత చిక్కుల వలయం ఈసారి కమ్ముకుని ఉంది. ఇవన్నీ సరిచేస్తూనే ఇచ్చిన హామీలు నెరవేర్చడంతో పాటు నిజమైన అభివృద్ధి అంటే ఏంటో నిరూపించాల్సిన జవాబుదారితనం టిడిపి కూటమి మీద ఉంది. అందుకే నారా చంద్రబాబునాయుడు అనే నేను కేవలం ప్రమాణం కాదు అంతకు మించిన బరువైన బాధ్యత.