జాతిపిత, స్వాతంత్య్ర సమరయోధుడు మహాత్మాగాంధీపై 1982లో సినిమా తీసే వరకు ఆయనెవరో ప్రపంచానికి తెలియదని, కాంగ్రెస్ నేతృత్వంలోని గత కేంద్ర ప్రభుత్వాలు గాంధీ గురించి తగిన విధంగా ప్రచారం చేయలేదని ప్రధానమంత్రి నరేంద్రమోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత 75 ఏండ్ల కాలంలో గాంధీకి అత్యున్నత ప్రపంచ ఖ్యాతిని తీసుకురావడం మన బాధ్యత కాదా? అని ఆయన ప్రశ్నించారు. ‘గాంధీజీ చాలా గొప్ప వ్యక్తి. కానీ ఆయన గురించి ఎవరికీ తెలియదని చెబుతున్నందుకు నన్ను క్షమించండి. 1982లో ఆయనపై సినిమా తీసే వరకు గాంధీ గురించి ప్రపంచానికి తెలియదు అని మోడీ అన్నారు.
‘సినిమా తీసిన తర్వాతనే అతను ఎవరనే విషయాన్ని తెలుసుకొనేందుకు ప్రపంచం ఆసక్తి చూపిందని, చేయాల్సిన పని మనం చేయలేదు. మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా గురించి ప్రపంచానికి తెలిస్తే, మహాత్మా గాంధీ కూడా వారికంటే తక్కువేమీ కాదు. ఈ విషయాన్ని అందరూ అంగీకరించాలి’ అని ప్రధాని మోదీ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా తిరిగిన తర్వాత తాను ఈ విషయాన్ని చెబుతున్నానన్నారు. గాంధీజీ ద్వారా భారతదేశాన్ని గుర్తించాలని అభిప్రాయపడ్డారు. మహాత్మా గాంధీ జీవితం ఆధారంగా 1982లో ‘గాంధీ’ పేరుతో ఓ చిత్రం వచ్చింది. దీనికి రిచర్డ్ అటెన్‌బరో దర్శకత్వం వహించారు.
మోడీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది. ‘గెట్ వెల్ సూన్.. దేవుడు ఆయనకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుకుంటున్నట్టు’ తన అధికారిక ఎక్స్ ఖాతాలో మోడీ ఫోటోతో పోస్టు చేసింది. గాంధీ వారసత్వాన్ని మోదీ నాశనం చేస్తున్నారని, మహాత్మాగాంధీ గురించి ప్రపంచానికి తెలియదని చెబుతున్న త్వరలో ప్రధాని పదవి నుంచి తప్పుకోనున్న మోదీ.. ఆయన ఏ ప్రపంచంలో బతుకుతున్నారో తనకు తెలియడం లేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ విమర్శించారు. వారణాసి, ఢిల్లీ, అహ్మదాబాద్‌లలో గాంధీ పేరుతో ఉన్న సంస్థలను బీజేపీ సర్కారే నాశనం చేసిందని ఆరోపించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates