ఏపీ సీఎం జగన్ ప్రమాదంలో ఉన్నారు. ఆయనను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. అసలు ఎవరిని నమ్మాలో నమ్మకూడదో కూడా అర్ధం కావడం లేదు. ఈ సమయంలో మనమే జగన్‌ను కాపాడుకోవాలి.. అని ఏపీ ప్రభుత్వ అదనపు అడ్వొకేట్ జనరల్(ఏఏజీ) పొన్నవోలు సుధాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. తాజాగా ఆయన బ్రిటన్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి ఎన్నారై వైసీపీ నాయకులతో ఓ హోటల్‌లో భేటీ అయ్యారు. ఏపీలో జరిగిన పోలింగ్, దీనికి ముందు జరిగిన ప్రచారం వంటి అంశాలపై ఆయన చర్చించారు.
వైసీపీకి ఎన్నారైల నుంచి అందిన సహకారం అద్భుతంగా ఉందని కొనియాడారు. ఇదేసహకారం ముందు ముందు కూడా అందించాలని సూచించారు. ప్రస్తుతం సీఎం జగన్ చాలా ప్రమాదకర పరిస్థితిని ఎదుర్కొంటున్నారని చెప్పారు. అందరూ జగన్‌ను అనుమానిస్తున్నారని.. అవమానిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇలాంటి క్లిష్ట సమయంలో అందరూ ఏకమై.. జగన్‌కు మద్దతుగా నిలవాలన్నారు. అయితే.. ఈ సందర్భంగా పొన్నవోలు ఒక్కసారిగా కంటతడి పెట్టడం గమనార్హం. చాలా సేపు ఆయన మౌనంగా ఉండిపోయారు. అయితే.. ఎన్నారై నాయకులు జోక్యం చేసుకుని ఆయనను ఓదార్చారు.
కాగా.. పొన్నువోలు వ్యవహారం.. ఎన్నికల ప్రచారంలో తీవ్రస్థాయిలో చర్చకు వచ్చిన విషయం తెలిసిందే. జగన్ అక్రమాస్తుల కేసుల్లో.. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును చార్జిషీటులో పొన్నవోలు చేర్పించారని.. జగన్ సూచనలు సలహాలతోనే ఆయన కోర్టుకు వెళ్లి పోరాడి మరీ.. వైఎస్ పేరును చార్జిషీటులో చేర్చారని.. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ షర్మిల ఎన్నికల ప్రచారంలో పేర్కొన్నారు. అయితే.. దీనికి పొన్నవోలు కూడా.. కౌంటర్ ఇచ్చారు. తను అలా చేయలేదని.. కాంగ్రెస్ పార్టీనే చార్జిషీట్‌లో వైఎస్ పేరును చేర్చిందని ఎదురు దాడి చేసిన విషయం తెలిసిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates