సభను తప్పుదోవ పట్టిస్తు, న్యాయవ్యవస్ధపై నోటికొచ్చినట్లు మాట్లాడిన వైసిపి ఎంపి విజయసాయిరెడ్డిపై అనర్హత వేటు వేయాల్సిందే అంటూ టిడిపి డిమాండ్ చేసింది. రాజ్యసభలో జరిగిన చర్చపై విజయసాయి మాట్లాడుతూ అసందర్భంగా కోర్టుల్లో న్యాయమూర్తులపై బురదచల్లుతు, దుష్ప్రచారం చేయటం చాలా అభ్యంతరకరమంటూ టిడిపి ఎంపి కనకమేడల రవీంద్రకుమార్ మండిపోయారు. హైకోర్టు జడ్జీలపై పార్లమెంటులో చర్చించటం, బురదచల్లటం, ఆరోపణలు చేయటం ఎంతమాత్రం సమర్ధనీయం కాదంటూ కనకమేడల స్పష్టంగా చెప్పారు.
తమ సొంత ప్రయోజనాలకోసం వైసిపి ఎంపి రాజ్యసభను వేదికగా వాడుకోవటంపై టిడిపి ఎంపి తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందన్నది కేవలం తప్పుడు ప్రచారం మాత్రమే అన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన వ్యవహారాలను ప్రస్తుత ప్రభుత్వం సమీక్షించకూడదన్న విషయాన్ని హైకోర్టు చెప్పిన విషయాన్ని ఎంపి గుర్తుచేశారు. న్యాయస్ధానం ఆదేశాలపై తమకు ఏవైనా అభ్యంతరాలుంటే వాటిని హైకోర్టులోనే చెప్పుకోవాలి కానీ రాజ్యసభలో ప్రస్తావించకూడదట.
నిజానికి కోర్టిచ్చిన స్టే విషయంలో వైసిపి ఎంపి ఎక్కడ ప్రస్తావించాలనే విషయాన్ని టిడిపి చెప్పాల్సిన అవసరం లేదు. ఏ వేదికపై తమ అభిప్రాయాలు లేదా ఆరోపణలు గుప్పించటమన్నది వైసిపి ఎంపి విచక్షణ అన్నది అందరికీ తెలిసిందే. అయితే… తదనంతర పరిణామాలు ఏమటనేది రాజ్యసభ చైర్మన్ కి సంబంధించిన విషయం. ఎంపి ప్రస్తావించిన అంశాలు అసంబద్ధంగా ఉందని రాజ్యసభ ఛైర్మన్ అనుకుంటే ఆ వ్యాఖ్యలను రికార్డుల నుండి తొలగిస్తారు. ఇక్కడ జరిగింది కూడా ఇదే. కోర్టుల్లో తమ ప్రభుత్వానికి అన్యాయం జరుగుతోందని చెప్పటమే విజయసాయి ఉద్దేశ్యం. దాన్నే ఆయన రాజ్యసభ వేదికగా వ్యక్తం చేశారు.
రాజ్యసభ ఛైర్మన్ పదే పదే కూర్చోమని చెబుతున్న వైసిపి ఎంపి వినకుండా మాట్లాడటం ఏమిటంటూ టిడిపి ఎంపి అన్నారు. ఎంపిలు మాట్లాడుతున్నపుడు రాజ్యసభ ఛైర్మన్ అయినా లోక్ సభ స్పీకర్ అయినా కూర్చోమని చెబుతునే ఉంటారు. ఎంపిలు తాము చెప్పదలచుకున్నది చెబుతునే ఉంటారు. ఒక్క నిముషం ఇవ్వండి, రెండు నిముషాలివ్వండని ఎంపిలు అడుగుతూ తాము చెప్పదలచుకున్నది చెప్పేయటం సభల్లో చాలా సహజం. ఇది వైసిపి ఎంపితోనే మొదలుకాలేదు. ఏ పార్టీ ఎంపి మాట్లాడుతున్నా ఇలాగే వ్యవహరిస్తుంటారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates