భువనగిరి : గెలిస్తే ఒక లెక్క .. ఓడితే మరో లెక్క !

శాసనసభ ఎన్నికలలో అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికలు పరీక్షగా నిలుస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులకు ఇవి సవాల్ అనే చెప్పాలి. మల్కాజ్ గిరి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు స్థానాలలో గెలుపు కొత్త ఎమ్మెల్యేలతో పాటు మంత్రి జూపల్లి కృష్ణారావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సామర్ధ్యానికి పరీక్ష. ఇక భువనగిరి లోక్ సభ గెలుపు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఆయన సోదరుడు, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సవాల్ గా మారింది.

భువనగిరిలో బీజేపీ నుండి బూర నర్సయ్యగౌడ్, కాంగ్రెస్ నుండి రేవంత్ సన్నిహితుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి, బీఆర్ఎస్ నుండి క్యామ మల్లేష్ లు పోటీ చేశారు. గత ఎన్నికలలో స్వల్ప తేడాతో ఓడిపోయిన బూర నర్సయ్యగౌడ్ ఈసారి సర్వశక్తులూ ఒడ్డాడు. ఒకసారి ఎంపీ, మరోసారి ఓటమి నేపథ్యంలో మూడో సారి మూడు నెలల ముందు నుండే వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాడు. మోడీ ఛరీష్మా, బీసీ కార్డు కలిసి వస్తుందని భావిస్తున్నాడు. బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేష్ యాదవ ఓటు బ్యాంకు, కేసీఆర్ ఛరీష్మా, కాంగ్రెస్ పాలన మీద ప్రజల్లో వ్యతిరేకతను నమ్ముకున్నాడు.

ఇక చివరి నిమిషం వరకు తమ కుటుంబానికి కాంగ్రెస్ టికెట్ కావాలని కోమటిరెడ్డి సోదరులు ప్రయత్నాలు చేసినా రేవంత్ తన సన్నిహితుడు చామలకు టికెట్ దక్కించుకున్నాడు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటి వద్దనే పార్లమెంట్ సమీక్ష నిర్వహించి అభ్యర్థిని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తానని స్పష్టం చేశాడు. దీంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దీనిని కాస్త ప్రతిష్టాత్మకంగానే తీసుకున్నాడు. రేవంత్ తో పాటు ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీలు కూడా వచ్చారు.

ఈ నేపథ్యంలో భువనగిరి ఫలితం ఎలా ఉండబోతుంది అన్నది చర్చానీయాంశంగా మారింది. గత శాసనసభ ఎన్నికలలో ఏడు నియోజకవర్గాల పరిధిలో బీజేపీకి ఇక్కడ కేవలం 75 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. అయితే పార్లమెంట్ ఎన్నికలలో ఎలా విజయం సాధించగలుగుతుంది అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. ట్రయాంగిల్ పోటీలో స్వల్ప తేడాతో తమకు విజయం ఖాయం అని బీఆర్ఎస్ వాధిస్తున్నది.

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సిట్టింగ్ ఎంపీ స్థానం కావడంతో వారికి ఇది ప్రతిష్టాత్మకంగా మారింది. కోమటిరెడ్డి సోదరులు గట్టిగా పనిచేసినందువల్లే కాంగ్రెస్ ప్రభావం కనిపించిందని, లేకపోతే ఆ మాత్రం ప్రభావం కూడా చూపలేకపోయేవారం అన్నది వారి అనుచరుల వాదన. భువనగిరి ఎంపీ స్థానం గెలిస్తే కోమటిరెడ్డి సోదరుల క్రెడిట్ లోకి, ఓడిపోతే అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఖాతాలోకి నెట్టే ప్రయత్నాలు సాగుతున్నాయని తెలుస్తుంది.