ఏపీ హింస‌.. నిప్పులు చెరిగిన ఈసీ..

రాష్ట్రంలో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల పోలింగ్ ప్ర‌క్రియ ముగిసిన త‌ర్వాత చెల‌రేగిన తీవ్ర హింస‌ పై కేంద్ర ఎన్నికల సంఘం నిప్పులు చెరిగింది. ఈ దాడుల‌ను ఎందుకు నిలువ‌రించ‌లేక పోయారని.. రాష్ట్ర ప్ర‌భు త్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కేఎస్ జ‌వ‌హ‌ర్‌రెడ్డి, డీజీపీ హ‌రీష్‌కుమార్ గుప్తాల‌ను నిల‌దీసిన కేంద్ర ఎన్నిక‌ల సంఘం.. వారు ఇచ్చిన వివ‌ర‌ణ‌తో ఏ మాత్రం సంతృప్తి చెంద‌లేదు. దీంతో తానే స్వ‌యంగా ఈ హింస‌పై చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఈ క్ర‌మంలో సంచ‌ల‌న నిర్ణ‌యాలు ప్ర‌క‌టించింది.

ఎన్నిక‌ల అనంత‌రం చెలరేగిన హింస‌ను ముందుగానే ప‌సిగ‌ట్ట‌లేక పోయిన‌.. చ‌ర్య‌లు తీసుకోలేక పోయిన ప‌ల్నాడు జిల్లా క‌లెక్ట‌ర్‌ను బ‌దిలీ చేస్తూ.. ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. త‌క్ష‌ణ‌మే ఆఫీస్ వ‌దిలి వెళ్లిపోవాల‌ని ఆయ‌న‌ను ఆదేశించింది. ఇక‌, ప‌ల్నాడు, అనంత‌పురం జిల్లాల ఎస్పీల‌ను స‌స్పెండ్ చేసింది. వారిని త‌క్ష‌ణ‌మే విధుల నుంచి త‌ప్పుకోవాల‌ని ఆదేశాలు జారీ చేసింది. ఇక‌, ప‌ల్నాడు, తిరుప‌తి, అనంత‌పురం డీఎస్సీల‌ను కూడా స‌స్పెండ్ చేస్తూ.. ఆదేశాలు ఇచ్చింది.

ఈ ఆదేశాలు త‌క్ష‌ణం అమ‌ల్లోకి వ‌స్తాయ‌ని ఎన్నికల సంఘం తెలిపింది. ఇదే స‌మ‌యంలో ప్ర‌తి ఘ‌ర్ష‌ణ‌, హింస‌ను ప్ర‌త్యేకంగా తీసుకుని ద‌ర్యాప్తు చేయాల‌ని పేర్కొంది. దీని వెనుక ప్రేరేపించిన వారిని ఎట్టి ప‌రిస్థితిలోనూ వ‌దిలి పెట్ట‌వ‌ద్ద‌ని తేల్చి చెప్పింది. ప్ర‌తి ఘ‌ర్ష‌ణ‌పైనా ప్ర‌త్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి.. ఐపీసీ స‌హా ఇత‌ర సెక్ష‌న్ల కింద కేసులు న‌మోదు చేయాల‌ని.. అరెస్టులు, జైళ్లు వంటివి త‌క్ష‌ణం చేయాల‌ని ఆదేశాలు జారీ చేసింది.

అంతేకాదు.. రాష్ట్రంలో మ‌రో 15 రోజుల పాటు కేంద్ర పారా మిలిట‌రీ బ‌ల‌గాల‌ను కొన‌సాగించాల‌ని కూడా కేంద్ర ఎన్నిక‌ల సంఘం పేర్కొంది. ముఖ్యంగా ఘ‌ర్ష‌ణ‌లు జ‌రుగుతున్న ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మోహ‌రించాల‌ని.. త‌క్ష‌ణ‌మే గొడ‌వ‌లు, ఘ‌ర్ష‌ణ‌లు అదుపులోకి వ‌చ్చేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని.. వీటిని నియంత్రించడంలో ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, డీజీపీలు ఇద్ద‌రూ కూడా బాధ్యులేన‌ని తేల్చి చెప్పింది. ఈ మేర‌కు సంచ‌ల‌న ఆదేశాలు జారీ చేయ‌డం గ‌మ‌నార్హం.