ఆంధ్రప్రదేశ్‌లో ఇంకో మూడు రోజుల్లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈసారి అసెంబ్లీ ఎన్నికలు మూడు ప్రధాన పార్టీలకు ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గెలుపు కోసం ఆయా పార్టీల వాళ్లు సర్వశక్తులు ఒడ్డి పోరాడుతున్నారు. సర్వేల్లో చాలా వరకు ఎన్డీయే కూటమి వైపే మొగ్గు కనిపిస్తుండగా.. వైసీపీని అంత తక్కువ అంచనా వేయడానికి వీల్లేదని… పోటీ గట్టిగానే ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ నేపథ్యంలో ఎన్నికల ముంగిట కొన్ని నియోజకవర్గాలు అందరి దృష్టినీ ఆకర్షిస్తూ.. ఫలితాల మీద ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. అలాంటి నియోజకవర్గాల్లో తిరుపతి ఒకటి. ఇది వైసీపీ సిట్టింగ్ స్థానం. గత పర్యాయం భూమన కరుణాకరరెడ్డి విజయం సాధించారు. ఈసారి ఆయన తనయుడు అభినయ్ రెడ్డి బరిలో నిలిచారు.
పొత్తులో భాగంగా జనసేనకు వెళ్లిన ఈ సీటు నుంచి ఆరణి శ్రీనివాసులు పోటీ చేస్తున్నారు. ఆయన 2019లో చిత్తూరు నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలవడం విశేషం. ఈసారి అక్కడ టికెట్ రాకపోవడంతో జనసేనలో చేరి తిరుపతిలో పోటీ చేస్తున్నారు. శ్రీనివాసులుకు టికెట్ ఖరారయ్యే సమయానికి తిరుపతిలో ఆయన బలం, ఫాలోయింగ్ అంతంతమాత్రం. మరోవైపు కరుణాకరరెడ్డి వారసత్వాన్ని కొనసాగిస్తూ పోటీలో నిలిచిన అభినయ్ రెడ్డి గత మూణ్నాలుగేళ్లుగా చురుగ్గా ఉంటూ మంచి ఫాలోయింగే సంపాదించాడు. దీంతో ఆయనకు విజయం నల్లేరుపై నడకే అనుకున్నారు. కానీ నెల రోజుల్లో వేగంగా పరిస్థితులు మారిపోయి ఇప్పుడు తిరుపతిలో వైసీపీ షాక్ తగిలే సంకేతాలు కనిపిస్తున్నాయన్నది స్థానిక వర్గాల మాట.
టీడీపీ, జనసేన కార్యకర్తలు సమన్వయంతో పని చేస్తూ శ్రీనివాసులు ప్రచారంలో దూసుకెళ్లడం.. డబ్బు కూడా బాగా ఖర్చు పెట్టడం, కుల సమీకరణాలు కూడా కలిసి రావడంతో ఇప్పుడు విజయానికి ఆయన చేరువయ్యారు అంటున్నారు. అదే సమయంలో భూమా కుటుంబ అవినీతి, ఆధిపత్యం గురించి స్థానికంగా చర్చ జరగడం.. ప్రభుత్వ వ్యతిరేకత తీవ్ర స్థాయికి చేరుకోవడం, తిరుపతి- తిరుమల పవిత్రతను వైసీపీ ప్రభుత్వం దెబ్బ తీసిందనే అభిప్రాయం బలంగా ఉండడం.. ఇలా అన్ని అంశాలూ ప్రతికూలమై వైసీపీకి ఇక్కడ షాక్ తగిలే పరిస్థితి నెలకొందన్నది విశ్లేషకుల మాట.
Gulte Telugu Telugu Political and Movie News Updates