తాజాగా ఒక ప్రముఖ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన సీఎం జగన్మోహన్ రెడ్డి.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై విరుచుకుపడ్డారు. తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. 2014లో చంద్రబాబుతో పొత్తులో ఉన్న పవన్ మీద నిందలేశారు. చంద్రబాబు ప్రభుత్వం చేసిన తప్పులకు పవన్ కూడా బాధ్యత వహించాలన్నారు. చంద్రబాబు మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలకు పవన్ కూడా వంత పలికారన్న జగన్.. ఆ కూటమిలోనూ బీజేపీ ఉందన్న విషయాన్ని అస్సలు ప్రస్తావించకపోవటం గమనార్హం.
నాటి చంద్రబాబు ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిందలేయటాన్ని తప్పు పట్టలేం. కానీ.. పవన్ ను దొంగగా అభివర్ణించినప్పుడు.. ఆయనతో పాటు అప్పటి కూటమిలో మరో భాగస్వామి అయిన బీజేపీని.. దానికి పెద్ద తలకాయ అయిన ప్రధాని నరేంద్ర మోడీని కూడా విమర్శించాలి కదా. మోడీని పల్లెత్తు మాట అనని జగన్మోహన్ రెడ్డి.. పవన్ కల్యాణ్ మీద మాత్రం విరుచుకుపడటం చూస్తే.. జగన్ వాదనలోని వ్యూహం ఇట్టే అర్థమవుతుంది.
ఆసక్తికరమైన అంశం ఏమంటే.. చంద్రబాబు.. పవన్ మీద ఒంటికాలి మీద లేచే జగన్మోహన్ రెడ్డి.. ఈసారి కూటమిలోనూ భాగస్వామి అయిన మోడీని మాత్రం మాట వరకు విమర్శించటం కనిపించదు. తన ఫోకస్ మొత్తం చంద్రబాబు.. పవన్ లకే పరిమితం చేస్తూ.. మోడీ ప్రస్తావనను మినహాయించటం ఆయన మాటల్ని చూసినప్పుడు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. 2014లో చంద్రబాబు పార్టనర్ పవన్ కల్యాణ్ అని చెప్పినప్పుడు.. మోడీ కూడా ఆయన పార్టనరే అన్న విషయాన్ని ప్రస్తావించే పరిస్థితి ఉందా? అన్న ప్రశ్నకు జగన్ సమాధానం చెప్పగలరా? ఇదంతా చూస్తే.. జగన్ వాదనాపటిమలోని గొప్పతనం ఇట్టే అర్థమవుతుందని చెప్పాలి.