రాజకీయాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని.. దీనికి మహిళలు కూడా సిద్ధంగా ఉండాలని తాజాగా ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. మహిళా దినోత్సవం సందర్భంగా అమరావతిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు. అనేక అంశాలను ప్రస్తావించారు. ఈ క్రమంలోనే చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ప్రకటిస్తామని తేల్చి చెప్పారు. అంతేకాదు.. ఎమ్మెల్యేలు అయ్యేందుకు మహిళలు ఇప్పటి నుంచే రెడీ కావాలని కూడా చంద్రబాబు బహిరంగ ప్రకటన చేశారు.
వాస్తవానికి 33 శాతం రిజర్వేషన్ల కల్పన అనేది ఆదినుంచి ప్రకటనలకే పరిమితం అయింది. 2014 ఎన్నిక ల్లోనూ పలు రాజకీయ పార్టీలు మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పినా.. అది సాకారం కాలేదు. కానీ.. తాజాగా పెరుగుతున్న మహిళల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని.. సీఎం చంద్రబాబు వ్యూహాత్మకంగా ఈ ప్రకటన చేశారు. మరోవైపు.. కేంద్ర ప్రభుత్వం కూడా గత ఏడాది మహిళలకు రాజకీయ రిజర్వేషన్లను చట్టబద్ధం చేసింది. దీనిపై అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను కూడా తీసుకుంది.
బీహార్, ఒడిశా, తెలంగాణ వంటి కొన్ని రాష్ట్రాలు మినహా.. ఇతర రాష్ట్రాలు మహిళలకు.. 33 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు రెడీ అయ్యాయి. ఇది.. చట్టంగా కూడా మారింది. 2028 తర్వాత నుంచి ఈ చట్టం అమల్లోకి రానుంది. తద్వారా అసెంబ్లీ, పార్లమెంటు సీట్లలో మహిళలకు 33 శాతం సీట్లను కేటాయించాలి. అయితే.. దీనిలోనూ కొన్ని మినహాయింపులు ఉన్నాయి. మహిళా ప్రాతినిధ్యం తక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో పురుషులకు సీట్లు ఇవ్వొచ్చు. అదేసమయంలో దీనిని అమలు చేయాలా? వద్దా.? అనేది రాష్ట్రాల నిర్ణయం.
ఈ క్రమంలో ఏపీలో దీనిని అమలు చేసేందుకు సీఎం చంద్రబాబు సిద్ధమైనట్టేనని తాజా ప్రకటన స్పష్టం చేసింది. దీని ప్రకారం .. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 175 అసెంబ్లీ సీట్లలో 57 స్థానాలను కేవలం మహిళలకు మాత్రమే కేటాయించారు. ఇక, ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలు ఎలానూ ఉన్నాయి. ఇలా.. రిజర్వ్‌డ్ సీట్లు పోగా.. జనరల్‌కు మిగిలేది.. సుమారు 110 లోపేనని లెక్కతేలుతోంది.
సీఎం చంద్రబాబు ఈ ప్రకటన చేసిన వెంటనే టీడీపీ అంతర్మథనంలో పడింది. వచ్చే ఎన్నికలపై ఆశలు పెట్టుకున్న అనేక మంది యువనాయకులు.. వారసులు కూడా ఇప్పుడు ఆలోచనపడ్డారు. ఏం జరుగుతుంది? రిజర్వేషన్ అమలు చేస్తే తమ పరిస్థితి ఏంటని.. వారు వాకబు చేయడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates