బీఆర్ఎస్ తో పొత్తు.. మౌనం వీడిన బీజేపీ

బీఆర్ఎస్ తో బీజేపీకి చీకటి పొత్తు ఉందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తుంటారు. అయితే, బీజేపీతో కాంగ్రెస్ చీకటి ఒప్పందం చేసుకుందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తుంటారు. అయినప్పటికీ ఎన్నడూ ఈ రెండు ఆరోపణలను బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించలేదు. కానీ, తాజాగా అసలు బీఆర్ఎస్ తో బీజేపీ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు తేల్చి చెప్పడం ఆసక్తికరంగా మారింది.

రెండుసార్లు బీఆర్ఎస్ కు, ఒకసారి కాంగ్రెస్ కు ప్రజలు అవకాశమిచ్చారని, ఈసారి బీజేపీకి ఛాన్స్ ఇస్తారని జోస్యం చెప్పారు. లేదంటే ఎంఐఎంకు హైదరాబాద్ ను కాంగ్రెస్ ధారాదత్తం చేస్తుందని రామచందర్ రావు విమర్శించారు. ఇక, బీఆర్ఎస్ తో పొత్తు లేదని, ఫ్యూచర్ తమదేనని బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ప్రజలు తమవైపే ఉన్నారని చెప్పారు. తమపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోంది కాబట్టి ఈ క్లారిటీ ఇస్తున్నామని కొండా విశ్వేశ్వర్ రెడ్డి చెప్పారు.

కుటుంబ పాలన కోసమా? కాళేశ్వరం కోసమా? దేనికి బీఆర్ఎస్ లో ఉండాలి అన్న భావన బీఆర్ఎస్ నేతల్లో వచ్చిందని, అందుకే బీఆర్ఎస్ నుండి బీజేపీకి వారు క్యూ కడుతున్నారని అన్నారు.

అందుకే, బీజేపీతో పొత్తు పెట్టుకోబోతున్నాం, బీఆర్ఎస్ లోనే ఉండండి అని బీఆర్ఎస్ నేతలను కేసీఆర్, కేటీఆర్ మభ్యపెడుతున్నారని ఆరోపించారు. తమ మందను కాపాడుకోవడం కోసం తండ్రికొడుకులు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ తో బీజేపీ ఎప్పటికీ పొత్తు పెట్టుకోదని తేల్చి చెప్పారు.