సార్వత్రిక ఎన్నికల సమయంలో జనసేనకు భారీ ఉరట లభించింది. అది కూడా ఏపీలో నోటిఫికేషన్ వెలువడి.. నామినేషన్ల పర్వానికి రెండు రోజులు గడువు ఉన్న నేపథ్యంలో జనసేనకు భారీ విజయం దక్కింది. ఆ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన గాజు గ్లాసు గుర్తును తాజాగా ఏపీ హైకోర్టు కన్ఫర్మ్ చేసింది. జనసేనకు గాజు గ్లాసు గుర్తునే నిర్ధారిస్తున్నట్టు కోర్టు పేర్కొంది. దీంతో ఇప్పటి వరకు డోలాయమానంలో పడిన జనసేనకు ఊపిరి పీల్చుకున్నట్టయింది. నామినేషన్లకుముందు భారీ విజయం కూడా దక్కింది.
ఏం జరిగింది?
ఏపీలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్న సమయంలో జనసేన పార్టీ ఎన్నికల గుర్తయిన గాజు గ్లాసును తమకు కేటాయించాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్(ఆర్ పీసీ) కేంద్ర ఎన్నికలసంఘాన్ని కోరింది. అయితే.. ముందుగా వచ్చిన వారికి ముందుగానే గుర్తును కేటాయిస్తామన్న కేంద్ర ఎన్నికల సంఘం.. దీనిని జనసేనకు కేటాయిస్తున్నట్టు పేర్కొంది. దీనిపై ఆర్ పీసీ.. హైకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో పిటిషనర్ తరఫున న్యాయవాది ఎంవీ రాజారామ్ వాదనలు వినిపించారు. ఈసీ నిబంధనలకు విరుద్ధంగా జనసేనకు గాజుగ్లాసు గుర్తు కేటాయించిందన్నారు.
జనసేన తరఫున సీనియర్ న్యాయవాది వేణుగోపాలరావు వాదనలు వినిపిస్తూ.. నిబంధనల ప్రకారమే గుర్తు కేటాయింపు జరిగిందన్నారు. ఈసీ తరఫున సీనియర్ న్యాయవాది అవినాశ్ దేశాయ్, న్యాయవాది శివదర్శిన్ వాదనలు వినిపిస్తూ.. ‘జనసేన’ ముందుగా దరఖాస్తు చేసుకుందని తెలిపారు. అసెంబ్లీ కాలపరిమితి ముగియడానికి ఆరు నెలల ముందు ఫ్రీ సింబల్ గుర్తుల కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు.
ఇలా చూస్తే.. గత డిసెంబరు 12న తాము దరఖాస్తుల ఆహ్వానాన్ని ప్రారంభించగా అదేరోజు జనసేన దరఖాస్తు చేసిందన్నారు. పిటిషనర్ పార్టీ (రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్) డిసెంబరు 20న దరఖాస్తు చేయగా అది 26న అందిందన్నారు. దీనిపై వాదనలు పూర్తయిన నేపథ్యంలో ఈ నెల 5న తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు.. తాజాగా తీర్పును వెలువరించింది. రాష్ట్రీ య ప్రజా కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. గాజు గ్లాసు గుర్తును జనసేనకే కేటాయిస్తూ. .కేంద్ర ఎన్నికల సంఘంతీసుకున్న నిర్ణయాన్ని కోర్టు సమర్థించింది. దీంతో జనసేన ప్రస్తుత ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తుపైనే పోటీ చేసేందుకు అవకాశం ఏర్పడింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates