పగిలే కొద్దీ గ్లాసు పదునెక్కుతుంది అంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ సారి పిఠాపురం నుండి శాసనసభ్యుడిగా పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో గాజువాక, భీమవరం శాసనసభ స్థానాల నుండి పోటీ చేసి రెండు చోట్లా ఓడిపోయాడు. ఈసారి ఎన్నికల్లో పిఠాపురం నుండి పవన్ కళ్యాణ్ గెలవడం తప్పనిసరి పరిస్థితి. అయితే రాజకీయాలు అంటేనే ఎత్తులు, పై ఎత్తులు. పిఠాపురం ఎన్నికల్లో పవన్ గెలుపుకు నవరంగ్ నేషనల్ కాంగ్రెస పార్టీ తలనొప్పిగా మారబోతుందా ? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.
ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణలో టీఆర్ఎస్, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ప్రతి ఎన్నికల్లో రోడ్డు రోలర్, రోటీ మేకర్, ట్రక్కు గుర్తులు తలనొప్పిగా మారేవి. ఇవి బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తును పోలి ఉండడమే దీనికి కారణం. అనేక ఎన్నికల్లో ఈ గుర్తుల మూలంగా బీఆర్ఎస్ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. అందుకే తెలంగాణలో ఆ గుర్తులు కేటాయించవద్దని ప్రతి సారి బీఆర్ఎస్ కోర్టులను, ఎన్నికల కమీషన్ ను ఆశ్రయించడం పరిపాటిగా మారింది.
సరిగ్గా ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ కు అదే పరిస్థితి ఎదురవుతున్నది. నవరంగ్ నేషనల్ కాంగ్రెస పార్టీ ఎన్నికల గుర్తు బకెట్. ఇది జనసేన పార్టీ ఎన్నికల గుర్తు గాజు గ్లాసును పోలి ఉండడం ఇప్పుడు జనసేన పార్టీ శ్రేణులకు గుబులు రేపుతున్నది. జనసేనకు ఓటు వేయాలనుకున్నవారు గ్లాసు అనుకుని బకెట్ గుర్తుకు ఓటేస్తే పవన్ కళ్యాణ్ కు చిక్కులు తప్పవని ఆందోళన చెందుతున్నారు. అసలే పవన్ కళ్యాణ్ కు ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్య. బకెట్ గుర్తుకు తోడు కొణిదెల పవన్ కళ్యాణ్ మాదిరిగా ఇంటి పేరు కె అక్షరం వచ్చే పలువురు పవన్ కళ్యాణ్ లను ఎన్నికల బరిలోకి దింపాలన్న ప్రయత్నాలు నడుస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో పిఠాపురం బరినుండి పవన్ గట్టెక్కుతాడా ? లేక బకెట్ తన్నేస్తాడా ? అన్నది వేచిచూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates