నిజామాబాద్ ఎవ‌రికో జిందాబాద్‌?

లోక్‌స‌భ ఎన్నికలు తెలంగాణ‌లోనూ కాక రేపుతున్నాయి. ప్ర‌ధాన పార్టీల‌న్నీ వీలైన‌న్నీ ఎక్కువ పార్ల‌మెంట్ స్థానాలు గెలుచుకోవ‌డంపై ఫోక‌స్ పెట్టాయి. తెలంగాణ‌లో 17 లోక్‌స‌భ స్థానాలున్న సంగ‌తి తెలిసిందే. వీటిల్లో కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్ఎస్ ఢీ అంటే ఢీ కొడుతున్నాయి. కొన్ని చోట్ల మూడు పార్టీల మ‌ధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. ఇందులో నిజామాబాద్ కూడా ఒక‌టి. ఇక్క‌డ ఎంపీగా గెల‌వ‌డం కోసం ముగ్గురు స్టార్ లీడ‌ర్లు పోటీప‌డుతున్నారు. కాంగ్రెస్ నుంచి జీవ‌న్‌రెడ్డి, బీఆర్ఎస్ నుంచి బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్ రెడ్డి, బీజేపీ నుంచి ధ‌ర్మ‌పురి అర్వింద్ బ‌రిలో ఉన్నారు.

తెలంగాణ‌లో అధికారంలో ఉన్న నేప‌థ్యంలో పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లోనూ దూకుడు ప్ర‌దర్శించాల‌ని కాంగ్రెస్ ప‌ట్టుద‌ల‌తో ఉంది. గ‌త ఎన్నిక‌ల కంటే ఈ సారి మెరుగైన ఫ‌లితాలు సాధించాల‌ని బీజేపీ చూస్తోంది. ఈ ఎన్నిక‌ల్లోనైనా ప్ర‌భావం చూపి ప‌రువు కాపాడుకోవాల‌ని బీఆర్ఎస్ అనుకుంటోంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌తి ఒక్క స్థానంపై మూడు పార్టీలు గురిపెట్టాయి. నిజామాబాద్‌లో విజ‌య ఢంకా మోగించేందుకు క‌స‌ర‌త్తులు చేస్తున్నాయి. ఇక్క‌డ సిటింగ్ ఎంపీగా ఉన్న అర్వింద్ మ‌రోసారి గెలిచేందుకు క‌స‌ర‌త్తులు చేస్తున్నారు. మ‌రోవైపు ఎమ్మెల్సీ జీవ‌న్ రెడ్డి, బాజిరెడ్డి కూడా ప్ర‌చారాన్ని హోరెత్తిస్తున్నారు.

నిజామాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గ ఓట‌ర్లు గ‌త కొన్ని ఎన్నిక‌ల్లో విల‌క్ష‌ణ‌మైన తీర్పు నిస్తూ వ‌స్తున్నారు. గ‌తంలో కాంగ్రెస్ కంచుకోట‌గా ఉన్న ఇక్క‌డ ఇటీవ‌ల ఒకే పార్టీ వైపు కాకుండా.. విభిన్న‌మైన నాయ‌కుల‌ను గెలిపిస్తున్నారు. 1952 నుంచి ఇక్క‌డ 11 సార్లు కాంగ్రెస్ నాయ‌కులు గెలిచారు. మూడు సార్లు టీడీపీ విజ‌యం సాధించింది. ఓ సారి స్వ‌తంత్ర అభ్య‌ర్థి గెలిచారు. ఒక్కోసారి బీఆర్ఎస్‌, బీజేపీ జ‌య‌కేత‌నం ఎగుర‌వేశాయి. గ‌త ఎన్నిక‌ల్లో రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న‌ప్ప‌టికీ ఇక్క‌డ క‌విత ఓడిపోవ‌డం గ‌మ‌నార్హం. అప్పుడు గెలిచిన అర్వింద్ మ‌రోసారి ఫేవ‌రెట్‌గా క‌నిపిస్తున్నారు. కానీ బాజిరెడ్డి, జీవ‌న్‌రెడ్డి నుంచి కూడా పోటీ తీవ్రంగానే ఉంది. ఇక ఈ ముగ్గురూ ఈ సారి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓడిపోయిన సంగ‌తి తెలిసిందే.