వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకుడిగా పేరు తెచ్చుకున్న చీరాల మాజీ ఎమ్మెల్యే, కాపు నాయకుడు ఆమంచి కృష్ణమోహన్.. కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఈ మేరకు ఆయన తన నిర్ణయాన్ని సైతం ప్రకటించారు. త్వరలోనే తాను కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయిం చుకున్నట్టు చెప్పారు. వైసీపీలో 2019 ఎన్నికలకు ముందు చేరిన ఆమంచి.. చీరాల నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో వైసీపీ టికెట్పై పోటీ చేశారు. వైసీపీ హవా జోరుగా సాగినా ఆయన విజయం దక్కించుకోలేకపోయారు. ఇదే సమయంలో టీడీపీ నుంచి ఇక్కడ పోటీ చేసిన కరణం బలరాం విజయం దక్కించుకున్నారు.
ఆ తర్వాత.. వైసీపీలో ఆమంచికి గుర్తింపు లేకుండా పోయింది. అయినా.. పార్టీలో కొనసాగారు. స్థానిక సంస్థల ఎన్నికల సమ యంలో తన వర్గం వారికి అవకాశం దక్కకపోతే.. స్వతంత్రంగా వారిని నిలబెట్టి 52 వార్డుల్లో గెలిపించుకున్నారు. దీంతో అప్పటి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి రంగంలోకి దిగి ఆమంచితో రాజీ పడ్డారు. దీంతో చీరాల మునిసిపాలిటీ వైసీపీకి దక్కింది. ఇక, ఆ తర్వాత కూడా ఆమంచికి ప్రాధాన్యం దక్కలేదు. పైగా చీరాల ఇచ్చేది లేదని.. పరుచూరు నుంచి పోటీ చేయాలంటూ..ఆయనను అక్కడకు బదిలీ చేశారు. అయితే, అయిష్టంగానే చీరాలకు వెళ్లిన ఆమంచి అక్కడ ఇమడలేక పోయారు. కమ్మడామినేషన్‌కు ఆయనకు పడలేదని పార్టీ కూడా గుర్తించింది.
తీరా టికెట్ ప్రకటించే సమయానికి అసలు ఆమంచిని పరిగణనలోకి తీసుకోలేదు. ఈ క్రమంలో పరుచూరుకు ఎడమ బాలాజీ ని ప్రకటించారు. దీంతో హర్టయిన ఆమంచి.. గత కొన్నాళ్లుగా పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. తాజాగా మీడియా ముందుకు వచ్చిన ఆమంచి తాను పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. అయితే.. ఆయన వైసీపీపై పన్నెత్తు మాట కూడా అనలేదు.. జగన్ తనను బాగానే చూసుకున్నారని.. ఆయన ప్రోత్సహించారని చెప్పారు. టీడీపీ కూడా తనకు గుర్తింపు ఇచ్చిందన్నారు. వాస్తవానికి తాను స్వతంత్రంగానే పోటీ చేయాలని భావించానని.. కానీ, తన అనుచరుల సూచనల మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు చెప్పారు. కాంగ్రెస్ టికెట్‌పై చీరాల నుంచి పోటీ చేస్తానన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates