జగన్ ను ఎవరూ అనలేని మాటను అనేసిన షర్మిల

ఏపీలో రాజకీయం నాటకీయ మలుపులు తిరుగుతోంది. గడిచిన దశాబ్దాల్లో ఎప్పుడూ కనిపించని ఎన్నో అంశాలు తాజా ఎన్నికల్లో తెర మీదకు వస్తున్నాయి. జగనన్న విడిచిన బాణాన్ని అంటూ కొన్నేళ్ల క్రితం వేలాదిమంది ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసిన షర్మిల.. ఇప్పుడు అదే జగన్ పై నిప్పులు కురిపిస్తున్నారు. ఏపీ పీసీసీ రథసారధిగా వ్యవహరిస్తున్న ఆమె తన సోదరుడు జగన్ ను ఉద్దేశించి చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి. ఇంతకాలం జగన్ ను ఉద్దేశించి ఎవరూ అనని మాటల్ని షర్మిల అనటం హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఆమె కడప జిల్లా కమలాపురంలో బస్సు యాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు.

తన సోదరి (వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె) డాక్టర్ సునీతను వెంట పెట్టుకొని బస్సు యాత్ర చేస్తున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్య చేశారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుంభకర్ణుడిలా నాలుగున్నర సంవత్సరాలు నిద్రపోయి.. ఎన్నికలకు ఆరు నెలల ముందు నిద్ర లేచాడు. ఆయన పాలనంతా అక్రమాలు.. దైర్జన్యాలు.. రాష్ట్రమంతా హత్యలు.. దోపిడీలు.. ఇసుక మాఫియా.. మైనింగ్ మాఫియా.. ఎక్కడా డెవలప్ మెంట్ లేదు అంటూ విరుచుకుపడ్డారు.

తన తండ్రి వైఎస్ హయాంలో సాగునీటి ప్రాజెక్టులకు పెద్ద పీట వేశారని.. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ప్రాజెక్టులకు దిక్కే లేదని.. కడప స్టీల్ ఫ్యాక్టరీ వైఎస్ కలగా పేర్కొన్నారు. స్టీల్ ఫ్యాక్టరీ పూర్తి అయి ఉంటే ప్రత్యక్షంగా పాతిక వేల మందికి.. పరోక్షంగా మరో 20వేల మందికి ఉద్యోగాలు వచ్చేవన్న షర్మిల.. ‘జగన్ ముఖ్యమంత్రి అయ్యాక శంకుస్థాపనలు తప్పిస్తే స్టీల్ ఫ్యాక్టరీ ముందుకు కదల్లేదు. జగన్ పాలనంతా హత్యా రాజకీయాలు.. దైర్జన్యాలు.. దోపిడీలకే పరిమితమైంది. జనం ఓట్లేసి గెలిపించింది దీనికేనా? పెండ్లిమర్రి మండలంలోని యాదవాపురం గ్రామంలో భూమి కోసం ఎంపీ అవినాశ్ రెడ్ి అనుచరులు శ్రీనివాస్ యాదవ్ అనే వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. ఇది పోలీసుల ప్రమేయంతో జరిగిందని ఆరోపణలు రావటంతో స్థానిక సీఐని.. ఎస్ఐను సస్పెండ్ చేశారు. అయితే.. ఎవరిని దోషులుగా చూపుతున్నారో వారి పేర్లను కనీసం ఎఫ్ఐఆర్ లో రాయకపోవటం దేనికి నిదర్శనం’ అంటూ ప్రశ్నించారు.

హత్య చేసిన వారు ఎంపీ.. ఎమ్మెల్యేకు సన్నిహితులు కావటంతోనే ఇప్పటికి వారు యథేచ్ఛగా బయటకు తిరుగుతున్నారని మండిపడ్డారు. వివేకా హత్య జరిగి ఐదేళ్లు అవుతున్నా హత్య చేసిన వారు బయట తిరగటాన్ని ప్రశ్నించారు. అన్ని ఆధారాలున్నా చర్యలు లేవన్న షర్మిల.. అవినాశ్ రెడ్డి నిందితుడని సీబీఐ చెప్పినప్పటికీ మళ్లీ అతడికే జగన్ టికెట్ ఇచ్చారన్నారు. వివేకా స్వయంగా జగన్ బాబాయ్ అని.. అయినా కనీస న్యాయం జరిగే పరిస్థితి లేదన్న షర్మిల.. “నిందితులు చట్టసభల్లోకి వెళ్లకూడదనే నేను పోటీలో నిలుచున్నా. న్యాయం ఒకవైపు. అధర్మం మరోవైపు. వైఎస్ బిడ్డ ఒకవైపు.. వివేకాను హత్య చేసిన నిందితులు మరోవైపు ఉన్నారు. ఎవరిని గెలిపించాలో ప్రజలు ఆలోచించి ఓటేయాలి” అంటూ షర్మిల చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి.