జగన్ కి చేతగాక బాబుపై ఏడుపు – భువనేశ్వరి

“ఏపీకి ఒక ముఖ్య‌మంత్రి ఉన్నారు. కానీ, ఆయ‌నకు పింఛ‌న్లు ఇవ్వ‌డం చేత‌కాదు. కానీ, చంద్ర‌బాబుపై ఏడ‌వమంటే మాత్రం ఏడుస్తారు” అని టీడీపీ అధినేత చంద్ర‌బాబు స‌తీమ‌ణి.. నారా భువ‌నేశ్వ‌రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. “నిజం గెల‌వాలి” పేరుతో నిర్వ‌హిస్తున్న యాత్ర‌.. నంద్యాల‌లో చేప‌ట్టారు. చంద్ర‌బాబు అరెస్టుతో గుండెలాగి మ‌ర‌ణించిన నంద్యాల పట్టణం, వెంకటాచలం కాలనీ, 34వ వార్డులో కార్యకర్త అబ్దుల్ రహీమ్ కుటుంబాన్ని పరామర్శించి, హామీ ప‌త్రం ఇచ్చారు. నిధుల‌ను బ్యాంకు ఖాతాలో వేసిన‌ట్టు పార్టీ కార్య‌క‌ర్త‌లు తెలిపారు.

అయితే.. ఈ సంద‌ర్బంగా నారా భువనేశ్వ‌రి మాట్లాడుతూ.. జ‌గ‌న్‌కు చేత‌కాక‌.. పింఛ‌న్లు ఇవ్వ‌లేక పోతున్నార‌ని.. కానీ, ఆ నెపాన్ని కూడా.. చంద్ర‌బాబుపై వేస్తున్నార‌ని ఆరోపించారు. “వాళ్లకు పెన్షన్లు ఇవ్వడం చేతకాక చంద్రబాబు పెన్షన్లు నిలిపేశారని విష ప్రచారం చేస్తున్నారు. ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించితేనే ప్రజలు సుఖశాంతులతో ఉంటారు. రాత్రింబ వళ్లు కష్టపడే తత్వం ఉన్న చంద్రబాబుతో రాష్ట్ర ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు చేయి చేయి కలిపి టీడీపీ ప్రభుత్వాన్ని స్థాపించడానికి ముందుకు రావాలి” అని నారా భువ‌నేశ్వ‌రి పిలుపునిచ్చారు.

“పేద ప్రజలకు ఆకలి అనేది తెలియకూడదనే ఉద్దేశంతో ఎన్టీఆర్ కిలో బియ్యం రూ.2కే ఇస్తే… చంద్రబా బు అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. అన్న క్యాంటీన్లలో ఒక్క ఏడాదిలోనే 7.5 కోట్ల మంది భోజనం చేశారు. ఇలాంటి అన్న క్యాంటీన్లను వైసీపీ ప్రభుత్వం అన్యాయంగా మూతవేసి పేదవాళ్ల కడుపు కొట్టింది. అయినా సరే టీడీపీ నాయకులు, కార్యకర్తలు నిర్విరామంగా అన్న క్యాంటీన్లు నడుపుతున్నారు. అన్న క్యాంటీన్లు నడుపుతున్న ప్రతి ఒక్కరికీ నా నమస్కారాలు. కృతజ్ఞతలు” అని భువ‌నేశ్వ‌రి చెప్పారు.

జ‌గ‌న్ హ‌యాంలో అడ్డగోలుగా పన్నులు వేసి, పేద, మధ్యతరగతి ప్రజల జేబులు ఖాళీ చేస్తున్నారని భువ‌నేశ్వ‌రి ఆరోపించారు. త‌మ ప్ర‌భుత్వం ఏర్ప‌డ‌గానే.. “సూపర్ సిక్స్” పథకాలను అమలు చేస్తామ‌న్నారు. ఈ సంద‌ర్బంగా ఆయా ప‌థ‌కాల‌ను ఆమె చ‌ద‌వి వినిపించారు. ఐదేళ్ల‌లో 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగికి ఉద్యోగం వ‌చ్చే వ‌ర‌కు ప్రతి నెల రూ.3వేలు నిరుద్యోగ భృతి, రైతులకు ప్రతియేటా రూ.20 వేలు పెట్టుబడి సాయం. 18 ఏళ్లు నిండిన మహిళకు ప్రతి నెల రూ.1,500 ఆర్థికసాయం. త‌ల్లికి వంద‌నం పేరుతో ఏటా ఎంత మంది పిల్లులు ఉంటే వారికి సంవత్సరానికి రూ.15,000 సాయం. పేదవాళ్లకు సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందిస్తారు. అందిస్తార‌ని భువ‌నేశ్వ‌రి చెప్పారు.