రాజుకు దారేదీ.. బీజేపీ అభ్య‌ర్థుల జాబితా విడుద‌ల‌

ఎప్పుడెప్పుడా అని చాలా ఉత్కంఠ‌గా ఎదురు చూసిన ఏపీకి సంబంధించిన‌ బీజేపీ అభ్య‌ర్థుల జాబితాను తాజాగా కేంద్ర నాయ‌కత్వం విడుద‌ల చేసింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీ-జ‌న‌సేన‌-టీడీపీ ఉమ్మ‌డిగా బ‌రిలోకి దిగుతున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో సీట్లు కూడా పంచుకున్నాయి. బీజేపీకి 10 అసెంబ్లీ స్థానాల‌ను ఇచ్చారు. అదేవిధంగా 6 పార్ల‌మెంటు స్థానాల‌ను కూడా క‌మ‌లం పార్టీ తీసుకుంది. వీటిలో తాజాగా 6 పార్ల‌మెంటు స్థానాల‌కు సంబంధించిన అభ్య‌ర్థుల జాబితాను బీజేపీ విడుద‌ల చేసింది. వీరిలో ఇద్ద‌రు మ‌హిళా అబ్య‌ర్థులు కూడా ఉన్నారు. బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వ‌రి, ఎస్టీ మ‌హిళ‌, మాజీ ఎంపీ కొత్త ప‌ల్లి గీత‌ల‌కు అవ‌కాశం ఇచ్చారు.

లోక్ సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ విడుద‌ల చేసిన ఐదో జాబితాలో తెలుగు రాష్ట్రాల్లో ఏపీకి సంబంధించి రాజమండ్రి – పురంధేశ్వరి, అనకాపల్లి – సీఎం రమేశ్, అరకు – కొత్తపల్లి గీత, రాజంపేట – కిరణ్ కుమార్ రెడ్డి, తిరుపతి – వరప్రసాద్, నరసాపురం – శ్రీనివాస్ వర్మకు టికెట్లు కేటాయించారు. ఇక‌, తెలంగాణలోని ఖమ్మం ఎంపీ స్థానాన్ని తాండ్ర వినోద్ రావు, వరంగల్ సీటును ఆరూరి రమేశ్ కు కేటాయించారు. ఇక్క‌డ టికెట్ ఆశించిన త‌న్నేటి కృష్ణ ప్ర‌సాద్‌ను ఏపీకి పంపించి.. అక్క‌డ బాప‌ట్ల టికెట్‌ను ఇప్పించారు. ఈయ‌న బాప‌ట్ల‌లో టీడీపీ త‌ర‌ఫున పోటీ చేస్తున్నారు.

రాజు ప‌రిస్థితి ఏంటి?

వైసీపీతో విభేదించి.. ఆ పార్టీపైనా, ఆ పార్టీ అధినేత‌, సీఎం జ‌గ‌న్‌పై నిత్యంకారాలు మిరియాలు నూరిన న‌ర‌సాపురం ఎంపీ క‌నుమూరి ర‌ఘురామ‌కృష్ణ‌రాజు ప‌రిస్థితి ఏంటి? అనేది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. ఆయ‌న ఆశించిన‌.. పోటీ చేయ‌డం ఖాయ‌మ‌ని భావించిన న‌ర‌సాపురం ఎంపీసీటును బీజేపీ.. శ్రీనివాస్ వ‌ర్మ‌కు కేటాయించేసింది. దీంతో ఎంపీ స్థానానికి రాజును ప‌రిశీలించ‌లేద‌ని తెలిసింది. మ‌రి ఆయ‌న ప‌రిస్థితి ఏంటి? అనేది చూడాలి. ప్ర‌స్తుతం ఆయ‌న టీడీపీలోనూ, జ‌న‌సేన‌లోనూ చేరలేదు. వైసీపీకి మాత్ర‌మే రాజీనామా చేశారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌కు ఏ పార్టీ కూడా టికెట్ ఇవ్వ‌లేదు. దీంతో ఆయ‌న‌ను అసెంబ్లీకి పంపించ‌నున్నారా? అనే చ‌ర్చ కూడా జ‌రుగుతోంది. అసెంబ్లీ టికెట్ల‌ను బీజేపీ ఇంకా ప్ర‌క‌టించాల్సి ఉంది.