పొలిటికల్ పొత్తులో భాగంగా కాకినాడ ఎంపీ టికెట్‌ను దక్కించుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తాజాగా ఈ టికెట్‌ను తంగెళ్ల ఉదయ్‌కు ఇస్తున్నట్టు ప్రకటించారు. ఇది చాలా కీలకమైన నియోజకవర్గం. పైగా బలమైన సామాజిక వర్గాలు (కాపు+ రెడ్లు) ఉన్న నియోజకవర్గం. మరి అలాంటి నియోజకవర్గాన్ని ఇప్పటి వరకు అసలు పేరు కూడా పెద్దగా తెలియని ఉదయ్ అనే యువకుడికి ఇవ్వడం ఏంటి? అనే చర్చ సాధారణమే. అయితే.. ఉదయం సాధారణ ప్రజలకు తెలియకపోవచ్చు. కానీ, పవన్ తోను, జనసేనతోనూ ఆయనకు ఐదేళ్ల అనుబంధం ఉంది.
2019 నుంచి ఉదయ్.. పవన్ తో కలిసి తిరుగుతున్నారు. మరో కీలక విషయం ఏంటంటే.. పవన్ కళ్యాణ్ ఆ మధ్య వారాహి వాహనంతో ప్రచారం చేపట్టారు కదా! ఆ వాహనం కొనిచ్చింది.. రిజిస్ట్రేషన్ చేయించింది కూడా ఉదయే కావడం గమనార్హం. అంతేకాదు.. వారాహి యాత్రల ఖర్చును కూడా ఈయనే భరించడం విశేషం. వారాహి యాత్ర అందుకే తొలి సారి పిఠాపురంలో నిర్వహించారు. దీనికి కూడా కారణం ఉంది. పిఠాపురం నుంచి ఉదయ్‌ను బరిలో నిలపాలని అనుకున్నారు. దీంతో ఆయన కొనిచ్చిన వాహనాన్ని ఆయన కోసం.. పిఠాపురంలోనే ఫస్ట్ టైం వినియోగించారు.
కట్ చేస్తే.. ఈ ఉదయ్ వాస్తవానికి 2006లో హైదరాబాదులో చదివి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ విభాగంలో పట్టా అందుకున్నాడు. ఆ తర్వాత పలు ఐటీ సంస్థల్లో పనిచేశాడు. అనంతర కాలంలో దుబాయ్ లో ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేశాడు. అయితే, సొంతంగా ఇండియాలోనే ఏదైనా సాధించాలన్న తపనతో ఉద్యోగం వదిలేసి, టీ టైమ్ పేరిట దేశవ్యాప్త టీ దుకాణాలను ప్రారంభించాడు. 2016లో రూ.5 లక్షల పెట్టుబడితో రాజమండ్రిలో తొలి టీ దుకాణం స్థాపించగా… ఇప్పుడు టీ టైమ్ ఫ్రాంచైజీల సంఖ్య 3 వేలకు పెరిగింది. టీ టైమ్ ప్రైవేట్ లిమిటెడ్ టర్నోవర్ రూ.35 కోట్లకు చేరింది.
ఈ క్రమంలోనే 2019 ఎన్నికలకు ముందు జనసేన తీర్థం పుచ్చుకున్న ఉదయ్.. పార్టీకి నమ్మకంగా పనిచేయడం ప్రారంభించా రు. పిఠాపురంపై ఆయన మనసు పెట్టిన మాట వాస్తవం. అయితే.. ఇప్పుడు రాజకీయ చర్చలు, సమీకరణల నేపథ్యంలో ఈ సీటును పవనే తీసుకున్నారు. దీంతో ఉదయ్‌ను నిరుత్సాహ పరచకుండా కాకినాడ ఎంపీ టికెట్ ఇచ్చారు. ఆర్థికంగా బలం ఉన్న వ్యక్తి కావడంతో ఇబ్బంది లేదనే టాక్ వినిపిస్తుండడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates