పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేయాలని నిర్ణయించుకోవడంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఆ నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్ ఎన్వీఎస్ఎస్ వర్మను టీడీపీ అధినేత చంద్రబాబు బుజ్జగించారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చిన వర్మతో ఆయన మాట్లాడారు. పొత్తుల కారణంగా కొన్ని త్యాగాలు తప్పవని ప్రభుత్వం రాగానే తగిన పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతో వర్మ పవన్ కల్యాణ్ గెలుపు కోసం ప్రయత్నం చేస్తానని ప్రకటించారు. ప్రభుత్వం రాగానే మొదటి విడతలోనే ఎమ్మెల్సీ ఇచ్చి తగిన ప్రాధాన్యం ఇస్తామని వర్మ అనుచరులకు చంద్రబాబు హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్‌ను గెలిపించుకోవడం చారిత్రక అవసరమని తెలిపారు. 2014లో పార్టీ పెట్టి కూడా.. పోటీకి దూరంగా ఉన్నారని, టీడీపీకి మద్దతిచ్చారని తెలిపారు. 2019 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రం కోసం ఎన్నో కష్టాలు పడుతున్నారని అన్నారు. గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసినా.. ఆయనను గెలిపించుకోలేకపోవడం దౌర్భాగ్యమని వ్యాఖ్యానించారు. ఈ సారి పవన్ కల్యాణ్‌ను గెలిపించుకోవాల్సిన అవసరం ప్రతిఒక్కరిపైనా ఉందని వ్యాఖ్యానించారు. పిఠాపురంలో అన్నీ ఆలోచించే ఆయన పోటీకి సిద్ధమయ్యారని తెలిపారు. ఆయనను చరిత్రాత్మక మెజారిటీతో గెలిపించుకోవాలని ఈ సందర్భంగా తాను సూచిస్తున్నట్టు చెప్పారు.
“వర్మ పోటీ చేస్తే.. ఎలా పనిచేస్తారో..ఇప్పుడు పవన్ కల్యాణ్ విషయంలో అంతే స్పోర్టివ్‌గా పనిచేయండి. చరిత్రలో రాసుకునే విధంగా ఆయనకు మెజారిటీ ఇప్పించండి” అని ఈ సందర్భంగా టీడీపీ నాయకులకు చంద్రబాబు సూచించారు. పవన్ కల్యాణ్ విజయం చాలా అవసరమని.. వ్యక్తిగతంగా ఆయనకు ముఖ్యం కాదని.. ఈ రాష్ట్రానికి పవన్ కల్యాణ్ అత్యంత అవసరమని చంద్రబాబు పేర్కొన్నారు.
కాగా, పవన్ పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన రోజు టీడీపీ ఇంచార్జి వర్మ అనుచరులు పిఠాపురం టీడీపీ ఆఫీసులోని ప్రచార సామాగ్రిని తగులబెట్టారు. దీంతో తాను ఇండిపెండెంట్ గా అయినా పోటీ చేస్తానని వర్మ తన అనుచరులతో చెప్పినట్లుగా ప్రచారం జరిగింది. ఈ క్రమంలో అనుచరులతో సమావేశం అయిన వర్మ.. వారి అభిప్రాయాలను విని.. చంద్రబాబుతో మాట్లాడేందుకు వచ్చారు. చంద్రబాబు హామీలకు చల్లబడ్డారు.
‘పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే, ఆయన్ని గెలిపించే బాద్యత నాది. గెలుపుని బంగారు పళ్ళెంలో పెట్టి పవన్ కళ్యాణ్‌కి ఇస్తా. పవన్ కళ్యాణ్ ప్రచారానికి కూడా రావాల్సిన అవసరం లేదు..’ అని గతంలో పలుమార్లు చెప్పిన వర్మ పొత్తుల్లో సీటు జనసేనకు పోవడంతో రివర్స అయ్యారు. చివరకు చల్లబడటంతో పవన్ కు ఎలాంటి సమస్యలు లేకుండా పోయింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates