40 ఏళ్ల రాజకీయ జీవితంలో బాబు కఠిన నిర్ణయాలు ఇవే

మొత్తానికి ఇన్ని దశాబ్దాల రాజకీయంలో చంద్రబాబునాయుడు గట్టి నిర్ణయాలు తీసుకుంటున్నట్లున్నారు. తొందరలో జరగబోయే ఎన్నికల్లో కొందరు సీనియర్ల విషయంలో కఠినంగా ఉండాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారని పార్టీవర్గాల సమాచారం. ఇందులో భాగంగానే కొందరు సీనియర్లకు రాబోయే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వకూడదని నిర్ణయించారట. పార్టీలో ఉంటే ఉండండి లేకపోతే పొమన్నట్లుగా చంద్రబాబు గట్టిగానే మాట్లాడుతున్నారని సమాచారం. విషయం ఏమిటంటే ఉత్తరాంధ్రలో ఇద్దరు సీనియర్ నేతలు, మాజీమంత్రులు గంటా శ్రీనివాసరావు, కళా వెంకటరావుకు పోటీచేయటానికి నియోజకవర్గంలేదు.

అందుకనే విశాఖపట్నంకు చెందిన గంటాను చీపురుపల్లిలో పోటీ చేయమన్నారు. అందుకు గంటా నిరాకరించగానే కళా వెంకటరావును అడిగారు. కళా కూడా కుదరదని చెప్పగానే చంద్రబాబు వీళ్ళిద్దరినీ దూరంపెట్టేశారట. తాను పోటీచేయమన్న విజయనగరం జిల్లా చీపురుపల్లిలో నియోజకవర్గంలో పోటీచేయాలి లేకపోతే లేదన్నట్లుగానే చంద్రబాబు మాట్లాడారట. దాంతో వీళ్ళిద్దరికీ ఏమిచేయాలో అర్ధంకావటంలేదు. అలాగే నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో మరో సీనియర్ తమ్ముడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరిస్థితి కూడా ఇంతే. సర్వేపల్లిలో ఐదుసార్లు సోమిరెడ్డి ఓడిపోయారు. అందుకనే రాబోయే ఎన్నికల్లో టికెట్ ఇవ్వకూడదని డిసైడ్ అయ్యారట.

పార్టీ అభ్యర్ధుల కోసం పనిచేసి, అధికారంలోకి వస్తే అప్పుడు స్ధాయికి తగ్గ పోస్టు ఇస్తానని హామీ ఇచ్చారట. మరో మాజీ మంత్రి దేవినేని ఉమది ఇదే పరిస్ధితి. ఉమకు పోటీచేయటానికి మైలవరంలో టికెట్ ఇవ్వటం కుదరదని చెప్పేశారట. పెనమలూరులో పోటీచేస్తే చేయాలి లేకపోతే పార్టీ గెలుపుకు పనిచేయమని చెప్పారట. దెందులూరులోని చింతమనేని ప్రభాకర్ కు కూడా టికెట్ కష్టమనే అంటున్నారు. ఈ మాజీ ఎంఎల్ఏ కూడా పార్టీ గెలుపుకు పనిచేయాల్సిందే అంటున్నారు తమ్ముళ్ళు. తునిలో యనమల సోదరులు రామకృష్ణుడు, కృష్ణుడిని పక్కనపెట్టేసి రామకృష్ణుడు కూతురు దివ్యను పోటీలోకి దింపుతున్నారు.

పార్టీవర్గాల అంచనా ప్రకారం సుమారు 35 మంది సీనియర్లకు చంద్రబాబు టికెట్లు ఇవ్వటంతేదట. జనసేన పోటీచేయబోతున్న 24 నియోజకవర్గాల్లో ఎలాగూ టీడీపీకి అవకాశంలేదు. బీజేపీ కూడా పొత్తులోకి వస్తే మరిన్ని సీట్లు వదులుకోక తప్పదు. పొత్తుల్లో కొందరిని, గెలుపు అవకాశాలు లేవని మరికొందరిని చంద్రబాబు పక్కకు పెట్టేయటం బహుశా ఇదే మొదటిసారేమో. మరి ఈ ప్రయత్నం ఎలాంటి ఫలితాలను ఇస్తుందో చూడాలి.