వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఆంధ్రప్రదేశ్‌లో తాజా హాట్ టాపిక్.. తూర్పుగోదావరి జిల్లాలోని అంతర్వేది ఆలయంలో పురాతన రథం దగ్ధం కావడం. లక్షలాది మంది భక్తుల మనోభావాలను దెబ్బ తీసిన ఈ ప్రమాదం ఎలా జరిగిందన్నది అర్థం కాలేదు. ఏపీ ప్రభుత్వం జరిపిన విచారణలో ఏమీ తేలలేదు. పిల్లలెవరో తేనెపట్టును కాల్చే క్రమంలో రథం దగ్ధమైందంటూ ఒక కారణాన్ని తెరపైకి తెచ్చారు. అది అందరికీ చాలా కామెడీగా అనిపించింది. ఎంపీ విజయసాయిరెడ్డి సహా కొందరు వైకాపా నేతలేమో ఈ పని ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు చేయించారంటూ ఆరోపించేశారు. ఐతే నిజంగా ఏం జరిగిందన్నది ఆధారపూర్వకంగా ఏమీ తేలలేదు. ఐతే ఈ ఉదంతాన్ని జనసేన-భారతీయ జనతా పార్టీ కూటమి కొంచెం సీరియస్‌గానే తీసుకుంది. ఈ ఉదంతంపై విచారించి దోషుల్ని శిక్షించకపోతే సీబీఐ విచారణ కోసం కేంద్రాన్ని డిమాండ్ చేస్తామని జనసేనాని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. అంతటితో ఆగకుండా శుక్రవారం ‘ఛలో అంతర్వేది’ కార్యక్రమాన్ని కూడా తలపెట్టారు. జనసైనికులకు ఈ దిశగా పిలుపు కూడా ఇచ్చారు.
ఐతే ఇంతకుముందు కర్నూలుకు చెందిన సుగాలి ప్రీతి కేసులోనూ పవన్ కళ్యాణ్ ఉద్యమానికి సిద్ధం కాగానే సీబీఐ విచారణకు ఆదేశించిన ఏపీ ప్రభుత్వం.. అంతర్వేది రథం ప్రమాదం విషయంలోనూ ఇలాగే స్పందించింది. ఈ కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లు గురువారం పొద్దుబోయాక ప్రకటించింది. ఈ ఇష్యూలో పవన్ అడ్వాంటేజ్ తీసుకోకుండా చూసేందుకే సీబీఐ విచారణకు ఆదేశించినట్లుంది ప్రభుత్వం. కానీ ఇలా కేసులను సీబీఐ విచారణకు అప్పగిస్తున్నట్లు ప్రకటించడమే తప్ప.. తదుపరి చర్యలు ఉండట్లేదు. మరి ఈ కేసు విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.
ఈ వ్యవహారంపై పవన్ ట్విట్టర్లో స్పందించాడు.‘‘అంతర్వేది సంఘటనలో సీబీఐ దర్యాప్తుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరటం అంటే పరిష్కారం అయినట్టు కాదు. నిందితుల్ని పట్టుకోవటానికి వేసిన తొలి అడుగు మాత్రమే… అంతర్వేది రథం దగ్ధం ఘటనకే సిబీఐ పరిమితం కారాదు. పిఠాపురంలో దేవతా విగ్రహాల ధ్వంసం, కొండబిట్రగుంట రథం దగ్ధం వెనుక ఎవరు ఉన్నారో సిబీఐ నిగ్గు తేల్చాలి. ఈ మూడు దుశ్చర్యలూ ఒకేలా ఉన్నాయి. కాబట్టి పిఠాపురం, కొండ బిట్రగుంటల్లోని ఘటనల్నీ సిబీఐ పరిధిలోకి తీసుకువెళ్ళండి. ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న అంతర్వేది ఆలయ భూములు అన్యాక్రాంతమైపోయాయి. ఈ ఆలయమే కాదు రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాలు, ధర్మసత్రాల ఆస్తులు ఆన్యులపరమైపోయాయి. వీటి గురించీ సిబీఐ ఆరా తీసి ఎండోమెంట్స్ ఆస్తులకు రక్షణ ఇవ్వాలి. వీటితోపాటు తిరుమల శ్రీవారి పింక్ డైమండ్ గురించీ సిబీఐ ఆరా తీయాలి. తిరుమల శ్రీవారికి శ్రీకృష్ణ దేవరాయలవారు ఇచ్చిన ఆభరణాల గురించీ ఆరా తీయాలి. విచారణ విషయంలో ప్రభుత్వం ఆమోదకర చర్యలు తీసుకోవడానికి సన్నద్ధమవుతున్న నేపథ్యంలో శుక్రవారం నాటి ‘ఛలో అంతర్వేది’ కార్యక్రమాన్ని విరమించుకుంటున్నాము’’ అని పవన్ పేర్కొన్నాడు.