రేవంత్ స్కెచ్ వర్కవుటవుతోదా ?

రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కూడా మంచి ఫలితాలు సాధించాలన్నది రేవంత్ రెడ్ది టార్గెట్. ఎందుకంటే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో కాంగ్రెస్ మంచి ఫలితాలు సాధించింది. వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లో అయితే దాదాపు క్లీన్ స్వీప్ చేసేసింది. మరికొన్ని జిల్లాల్లో మెజారిటి స్ధానాల్లో గెలిచింది. అయితే వివిధ జిల్లాల్లో ఇంతటి ప్రభావం చూపించిన కాంగ్రెస్ గ్రేటర్ పరిధిలో మాత్రం జీరోగా మిగిలిపోయింది.

గ్రేటర్ పరిధిలోకి వచ్చే రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో దాదాపు ఫెయిలైందనే చెప్పాలి. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో సుమారు 5 స్ధానాలున్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద్, మెదక్, చేవెళ్ళ, మల్కాజ్ గిరి స్ధానాల్లో గెలవాలన్నది హస్తంపార్టీ గట్టి ప్రయత్నం. అలా గెలవాలంటే ముందు బలమైన నేతలు చాలా అవసరం. అందుకనే ఇతర పార్టీలు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీపై రేవంత్ దృష్టిపెట్టారు. ఇందులో భాగంగానే వికారాబాద్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎంఎల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఆయన భార్య జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ నునీతారెడ్డిని చేర్చుకున్నారు.

తాజాగా మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి, ఆయన కోడలు రంగారెడ్డి జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ అనీతారెడ్డి చేరారు. ఆదివారం జీహెచ్ఎంసీ డిప్యుటి మేయర్ మోతె శ్రీలతారెడ్డి, శోభన్ రెడ్డి దంపతులు చేరబోతున్నారు. అవకాశమున్న ప్రతి చోటా వీలైనంత మంది నేతలను బీఆర్ఎస్ లో నుండి లాగేసుకుని బలహీనపరచాలన్నది రేవంత్ లక్ష్యం.

దీనివల్ల రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కారుపార్టీని గట్టి దెబ్బకొట్టాలని పావులు కదుపుతున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరుతున్న, చేరబోతున్న చాలామంది నేతలు ఒకపుడు కాంగ్రెస్ వాళ్ళే. కేసీయార్ ముఖ్యమంత్రి కాగానే నేతల్లో చాలామందిని తమ పార్టీలోకి లాగేసుకున్నారు. అంటే అప్పట్లో కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ లోకి ఎలాగైతే వెళ్ళిపోయారో ఇపుడు అదే పద్దతిలో బీఆర్ఎస్ లో నుండి మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చేస్తున్నారు. కాబట్టి గ్రేటర్ పరిధిలో ఎంతవీలైతే అంతమంది గట్టి బీఆర్ఎస్ నేతలను హస్తంలోకి చేర్చుకోవాలన్నది రేవంత్ ఆలోచన. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.