అర్జున్ మార్కెట్ బ్రతికే ఉంది

ఒకప్పుడు యాక్షన్ కింగ్ గా మాస్ ప్రేక్షకులకు బాగా దగ్గరైన హీరో అర్జున్. తెలుగులో మా పల్లెలో గోపాలుడు లాంటి హిట్లు చాలానే ఉన్నప్పటికీ జెంటిల్ మెన్ తర్వాత అయన ఇమేజ్, మార్కెట్ అమాంతం పెరిగిపోయాయి. అప్పట్లో ఒకే ఒక్కడుకి తమిళనాడులో కంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే ఎక్కువ కలెక్షన్లు వచ్చిన విషయాన్ని ట్రేడ్ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇంత వయసు వచ్చినా బాడీ ఫిట్ నెస్ విషయంలో కుర్రాళ్లతో పోటీ పడటం ఆయన ప్రత్యేకత.

అలాంటి అర్జున్ చాలా సంవత్సరాలుగా సపోర్టింగ్ రోల్స్ ఎక్కువగా చేస్తున్నారు. నా పేరు సూర్యలో అల్లు అర్జున్ తండ్రిగా నటించారు. నితిన్ లై, విజయ్ లియో, అజిత్ పట్టుదలలో నెగటివ్ షేడ్స్ చేశారు. ఇక సపోర్టింగ్ క్యారెక్టర్ల జాబితా చాలా పెద్దది. మాములుగా ఇలా కెరీర్ సెకండ్ ఇన్నింగ్స్ లో సోలో హీరోగా మళ్ళీ ట్రాక్ లోకి రావడం కష్టం. అందుకే శ్రీకాంత్, జగపతిబాబు, మోహన్ బాబు లాంటి సీనియర్లు ఎప్పుడో తమ మీదే కథ నడవాలనే రూల్ పక్కన పెట్టేశారు.

కానీ అర్జున్ విషయంలో వేరే జరుగుతోంది. ఇటీవలే విడుదలైన బ్లాస్ట్ జోన్ మంచి వసూళ్లు రాబడుతోంది. కేవలం పదిహేను కోట్లతో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ ఫైనల్ రన్ అయ్యేలోపు యాభై కోట్లు దాటడం ఖాయమని ఇన్ సైడ్ టాక్. నెట్ ఫ్లిక్స్ రూపంలో పెట్టుబడి మొత్తం రిలీజ్ ముందే వెనక్కు వచ్చేసిందట. ఇప్పుడు లాభాల దిశగా వెళ్తోంది. కరుప్పు మంచి స్వింగ్ లో ఉన్నప్పుడే బ్లాస్ట్ కి ఇంత స్పందన రావడం ఊహించని పరిణామం.

ఈ వారంలో పెద్ది లేకపోయి ఉంటే ఇంకా బలమైన రన్ దక్కేదేమో కానీ మొత్తానికి అర్జున్ లో సత్తా అయిపోలేదని చెప్పడానికి ఈ సినిమా బాగా ఉపయోగపడుతోంది. ఒకప్పుడు చిరంజీవి శ్రీమంజునాథ, కృష్ణవంశీ శ్రీ ఆంజనేయం, జగపతిబాబు హనుమాన్ జంక్షన్ లాంటి స్ట్రెయిట్ సినిమాలు ఎక్కువ చేసిన అర్జున్ ఇటీవలే కూతురు ఐశ్వర్యని డైరెక్ట్ చేసిన సీత పయనంని కన్నడతో పాటు సమాంతరంగా తెలుగులోనూ నిర్మించారు. కాకపోతే అనుకున్నదాని కన్నా పెద్ద ఫ్లాప్ అయ్యింది.