మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్‌తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ భేటీ అయ్యారు. ప్రస్తుతం రాజకీయంగా ఈ వ్యవహారం ప్రాధాన్యం దక్కించుకుంది. మహారాష్ట్రకు చెందిన ఓ కీలక బీజేపీ నాయకుడికి.. రాజ్యసభ సీటును ఇస్తున్నారన్న ప్రచారం నేపథ్యంలో లోకేష్.. నేరుగా అక్కడి ముఖ్యమంత్రితో భేటీ కావడం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. వాస్తవానికి నాలుగు స్థానాలు ఖాళీ అవుతున్న నేపథ్యంలో ఏపీలోని కూటమి పార్టీలకు ఈ నాలుగు వస్తాయి. అయితే.. టీడీపీ, జనసేనలే ఈ స్థానాలను తీసుకుంటాయన్న ప్రచారం ఉంది.
కానీ, ఆదివారం బీజేపీ అగ్రనాయకత్వం భేటీ అయి.. ఒక స్థానాన్ని తాము తీసుకునే ప్రతిపాదనను తెరమీదికి తెచ్చింది. దీనిని కూడా మహారాష్ట్రకు చెందిన ఓ పారిశ్రామిక వేత్తలకు ఇవ్వాలన్న ప్రతిపాదన వచ్చిందని జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ పరిణామాల అనంతరం.. హుటాహుటిన.. సోమవారం ఉదయం.. లోకేష్.. ముంబై వెళ్లారు. సీఎం ఫడణవీస్‌తో భేటీ అయ్యారు. అయితే.. రాజ్యసభ సీటుపై ఆయనతో చర్చించారా? లేదా? అనే విషయం గోప్యంగా మారింది. తాను మహారాష్ట్రలో ఐటీ, విద్యా శాఖల్లో అమలవుతున్న ఉత్తమ విధానాలను అధ్యయనం చేసేందుకు వచ్చినట్టు మంత్రి చెప్పారు.
కానీ, వాస్తవానికి ఏపీలోనే ఐటీ, విద్యాశాఖల్లో ఉత్తమ విధానాలు అమలు చేస్తున్నామని.. ఇటీవలే మంత్రి చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది. సో.. దీనిని బట్టి.. రాజకీయ పరమైన అంశాలపైనే ఇరువురు చర్చించారని సమాచారం. ప్రస్తుతం టీడీపీలో కీలక రోల్ పోషిస్తున్న లోకేష్.. జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలోనే ఫడణవీస్‌ను కలుసుకున్నారు. ఆయన వెంట పలువురు ఎంపీలు కూడాఉన్నారు. ఈ క్రమంలో రాజ్యసభ సీటు విషయంపైనే చర్చించారని పరిశీలకులు. విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పోటీ ప్రకారం.. టీడీపీ మూడు స్థానాలు తీసుకున్నా.. అందరినీ మెప్పించలేని పరిస్థితి నెలకొంది.
ఈ సమయంలో బీజేపీకి ఇవ్వాలంటే ఆలోచన చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయినప్పటికీ.. తమకు ఒక స్థానం అవసరమని బీజేపీ చెబుతున్న క్రమంలో లోకేష్ ద్వారా చంద్రబాబు వర్తమానం పంపి ఉంటారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదిలావుంటే.. తాను మాత్రం విద్య, ఐటీ విషయాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రిని కలుసుకున్నానని లోకేష్ ఎక్స్‌లోపేర్కొన్నారు. అదేవిధంగాపలు పెట్టుబడి దారీ సంస్థలతోనూ చర్చించినట్టు ఆయన తెలిపారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates