వైసీపీ మంత్రి విడదల రజనీపై చంద్రబాబు సేమ్ టు సేమ్ అస్త్రం వేసేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం చిలకలూరిపేట ఎమ్మెల్యేగా ఉన్న రజనీపై అక్కడ తీవ్ర వ్యతిరేకత ఉందన్న అంచనాల నేపథ్యంలో ఆమెను ఎలాగైనా అసెంబ్లీలో ఉండేలా చూడాలని జగన్ నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఆమెను గుంటూరు వెస్ట్ సీటుకు మార్చారు. గుంటూరు వెస్ట్ ఇన్‌చార్జ్‌గా నియమితులైన ఆమె ప్రచారాన్ని స్పీడప్ చేసేశారు. వెస్ట్‌లో రజనీని ఓడించాలంటే ఎవరిని రంగంలోకి దింపాలా ? అని టీడీపీ అధిష్టానం గత నెల రోజులుగా సమాలోచనలు చేస్తోంది.
చాలా పేర్లు, చాలా ఈక్వేషన్లు పరిశీలనకు వచ్చాయి. కాపులా, కమ్మలా, వైశ్యులా, బీసీలా ఇలా ఎవరిని రంగంలోకి దింపితే రజనీకి బలమైన ప్రత్యర్థి అవుతారో చాలా చర్చలు జరిగాయి. చివరకు రజనీపై సేమ్ టు సేమ్ అస్త్రం వాడుతున్నారని పార్టీలో చర్చ జరుగుతోంది. రజనీ బీసీ మహిళ కాగా.. ఆమె ఇప్పుడు చంద్రబాబు అదే బీసీ మహిళను రంగంలోకి దింపుతున్నట్టు తెలుస్తోంది. ఆమె ఎవరో కాదు గల్లా మాధవి.
గల్లా మాధవి బీసీల్లో రజక సామాజిక వర్గానికి చెందిన వారు. గుంటూరు వికాస్ హాస్పటల్స్ డైరెక్టర్‌గా ఉన్న మాధవి గతం నుంచి సేవా కార్యక్రమాల్లో యాక్టివ్‌గా ఉంటున్నారు. ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం ఇదే తొలిసారి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీ ఏకంగా గుంటూరు వెస్ట్‌లో విడదల రజనీ, తాడికొండలో మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత, గుంటూరు తూర్పులో షేక్‌నూరి ఫాతిమాతో పాటు రేపోమాపో మంగళగిరి నుంచి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమలను రంగంలోకి దించబోతోంది.
ఇలా వైసీపీ ఏకంగా నలుగురు మహిళలకు ఎమ్మెల్యే టిక్కెట్లు ఇవ్వగా… టీడీపీ నుంచి ఉమ్మడి గుంటూరు జిల్లా మొత్తం మీద ఒక్క మహిళ కూడా లేరు. అటు ప్రకాశం జిల్లాలోనూ అదే పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే గల్లా మాధవిని రజనీపై పోటీకి దింపితే మహిళా కోటాతో పాటు బీసీ కోటాలో బలమైన ఈక్వేషన్ అవుతుందని బాబు భావిస్తున్నారు. మాధవి టీడీపీ క్యాండెట్‌గా ఫిక్స్ అయితే గుంటూరు వెస్ట్‌లో ఇద్దరు బీసీ మహిళల పోరు హోరాహోరీగా ఉండడం ఖాయం.