నూజివీడు – మైల‌వ‌రం – పెన‌మ‌లూరు సీట్లు వీళ్ల‌కే!

టీడీపీ, వైసీపీల్లో రాజ‌కీయ దుమారం పెరుగుతోంది. నాయ‌కుల జంపింగులు కూడా సాగుతున్నాయి. ఏ నాయకుడు ఎప్పుడు ఎటు నుంచి ఎటు మారుతున్నారో చెప్ప‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. ఇక‌, వేరే పార్టీల నాయ‌కుల‌ను చేర్చుకునేది లేదు.. అని ల‌క్ష్మ‌ణ రేఖ‌లు గీసుకున్న వైసీపీ కానీ, టీడీపీ కానీ.. స్వీయ నిబంధ‌న‌లు తోసిపుచ్చి.. పార్టీల్లోకి నాయ‌కుల‌ను ఆహ్వానిస్తున్నాయి. ఈ క్ర‌మంలో తాజాగా నూజివీడు టీడీపీ ఇంచార్జ్ ముద్ద‌ర‌బోయిన వెంక‌టేశ్వ‌ర‌రావును వైసీపీలోకి ఆహ్వానించారు.

దీంతో ఆయ‌న‌కు మైల‌వరం టికెట్ ఇస్తార‌ని తెలుస్తోంది. ముద్ద‌ర‌బోయిన నూజివీడులో ప‌నిచేసిన అనుభ వం.. రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన అనుభ‌వం కూడా ఉన్నాయి. పైగా క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు కూడా కావ‌డంతో వైసీపీ మైల‌వ‌రం వైపు ఆయ‌న‌ను పంపించే అవ‌కాశం ఉంది. ఈ మేర‌కు పార్టీ అధినేత సీఎం జ‌గ‌న్ ప‌రిశీల‌న చేస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇక‌, పెన‌మ‌లూరులో ఇప్ప‌టికే మంత్రి జోగి ర‌మేష్‌కు టికెట్ ఇచ్చేస్తామ‌ని చెప్పారు.

దీంతో వైసీపీ వైపు నుంచి ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ క్లారిటీ ఉంది. ఇక‌, నూజివీడును సిట్టింగ్ ఎమ్మెల్యే మేకా ప్ర‌తాప్ అప్పారావుకే ఇవ్వ‌నున్నారు. టీడీపీ విష‌యానికి వ‌స్తే.. ఈ మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ గంద‌ర‌గోళం నెల‌కొన‌గా.. తాజాగా నూజివీడు పార్టీ స‌మ‌న్వ‌య క‌ర్త‌గా పెన‌మ‌లూరు వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థ‌సార‌థికి ప‌గ్గాలు ఇస్తున్న‌ట్టు పార్టీ ప్ర‌క‌టించింది. ఇక‌, మిగిలింది.. మ‌రో రెండు నియోజ‌క‌వ‌ర్గాలు. పెన‌మ‌లూరు, మైల‌వ‌రం.

పెన‌మ‌లూరులో మాజీ ఎమ్మెల్యే బోడే ప్ర‌సాద్‌ను ప‌క్క‌న పెడుతున్న‌ట్టు స‌మాచారం చేరిపోయింది. ఆయ‌న గురించి స్థానికంగా చంద్ర‌బాబు ఐవీఆర్ ఎస్ ద్వారా స‌ర్వే చేశార‌ని.. ఈ స‌ర్వేలో ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా ఫ‌లితం వ‌చ్చింద‌ని పార్టీ చెబుతోంది. దీంతో ఇక్కడ ఎవ‌రిని నియ‌మిస్తార‌నేది చూడాలి. మ‌రోవైపు.. మైల‌వ‌రం టికెట్‌ను ఆశిస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ ప్ర‌సాద్‌ను టీడీపీ ఆద‌రిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇక‌, ఇదే టికెట్ ఆశిస్తున్న మాజీ మంత్రి దేవినేని ఉమాకు టికెట్ కేటాయించాల్సి ఉంది. వీటి నియామ‌కాల‌పై ఇంకా స్ప‌ష్టత రాలేదు. మ‌రోవైపు.. 20 రోజుల్లోనే ఎన్నిక‌ల షెడ్యూల్ రానుంది. ఏం చేస్తారో చూడాలి.