జనసేన నాయకుడు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అనకాపల్లి జిల్లాలో పర్యటిస్తున్న ఆయన.. వచ్చే ఎన్నికల వరకు కూడా అక్కడే ఉంటానని చెప్పేశారు. అంతేకాదు.. వైసీపీ ఎలా గెలుస్తుందో కూడా చూస్తానని వ్యాఖ్యానించారు. “ఇక్కడే ఉంటా.. వైసీపీ ఎలా గెలుస్తుందో చూస్తా!” అని చెప్పడం గమనార్హం. అంతేకాదు.. రాష్ట్రంలో రాక్షస పాలన పోయే విధంగా జనసేన – టీడీపీ కూటమి ముందుకు సాగుతాయని అన్నారు.
తాజాగా అనకాపల్లి జిల్లా అచ్చుతాపురం మండలంలో పర్యటించిన ఆయన స్థానిక జనసేన, టీడీపీ నాయకులతో భేటీ అయ్యారు. స్థానిక రాజకీయాలపై ఆయన చర్చించారు. అనంతరం ఆయన వైసీపీ పై విమర్శలు గుప్పించారు. “వైసీపీ పాలనలో దాడులు పెరిగిపోయాయి. రాబోయే ఎన్నికల్లో జగన్ పాలనకు చరమగీతం పాడేందుకు జనసేన- టీడీపీ నేతలు సిద్ధంగా ఉండాలి. రెండు పార్టీల్లోని నేతలు జగన్ ప్రభుత్వ తప్పిదాలపై ప్రశ్నించాలి. ప్రతి ఇంటికీ వెళ్లి వైసీపీ దరిద్రపు పాలనను ప్రచారం చేయాలి. అనకాపల్లి జిల్లాలో సమస్యలపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నా. వచ్చే ఎన్నికల వరకు ఎక్కడికి వెళ్లను” అని నాగ బాబు అన్నారు.
ఎంపీ సీటుపైనే దృష్టి
కాగా.. గత ఎన్నికల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం పార్లమెంటు స్థానం నుంచి జనసేన టికెట్‌పై పోటీ చేసిన నాగబాబు.. వచ్చే ఎన్నికల్లో అనకాపల్లిని ఎంచుకున్నట్టు తెలిసింది. నరసాపురం నుంచి వైసీపీ టికెట్‌పై గెలిచిన రఘురామకృష్ణరాజు.. టీడీపీ తరఫున ఇక్కడ నుంచి పోటీ చేయనున్న దరిమిలా.. ఆ సీటును వదిలేసిన నాగబాబు.. కాపు సామాజిక వర్గం సహా శెట్టిబలిజ సామాజిక వర్గం, మత్య్సకారులు ఎక్కువగా ఉన్న అనకాపల్లి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని తెలిసింది. ఈ క్రమంలోనే ఆయన పార్లమెంటు నియోజకవర్గంలో తిష్టవేశారు. గత 20 రోజులుగా ఆయన మూడు సార్లు ఇక్కడ పర్యటించడం గమనార్హం. అయితే.. పార్టీ టికెట్‌పై మాత్రం ఎలాంటి క్లారిటీ రాలేదు. కానీ, నాగబాబు అనకాపల్లి పార్లమెంటు నుంచి పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates