రాబోయే ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లోను త్రిముఖ పోటీ తప్పదు. అయితే కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం పోటీ రసవత్తరంగా ఉండబోతోంది. అలాంటి నియోజకవర్గాలు కడప జిల్లాలోనే ఎక్కువగా ఉండబోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే కడప జిల్లా అంటేనే వైఎస్ కుటుంబంది అని ముద్రపడిపోయింది. ఇలాంటి కుటుంబంలో అన్న జగన్మోహన్ రెడ్డి చెల్లెలు షర్మల మధ్య రాజకీయ పోరు నడుస్తోంది. కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిల బాధ్యతలు తీసుకోగానే కడప జిల్లాపైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు.
దీని ప్రకారమే కడప మాజీ ఎంఎల్ఏ, మాజీ మంత్రి అహ్మదుల్లా కాంగ్రెస్ లో చేరారు. అలాగే బద్వేలు మాజీ ఎంఎల్ఏ కమలమ్మ కూడా మళ్ళీ యాక్టివ్ అయ్యారు. ఇక టీడీపీ నేత విజయజ్యోతి కాంగ్రెస్ లో చేరారు. ఇలాంటి వివిధ నియోజకవర్గాల్లోని కొందరు కాంగ్రెస్ పాత కాపులు మళ్ళీ యాక్టివ్ అయ్యే సూచనలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఇపుడు విషయం ఏమిటంటే రాబోయే ఎన్నికల్లో బద్వేలులో వైసీపీ అభ్యర్ధిగా డాక్టర్ సుధే పోటీచేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
అలాగే టీడీపీ తరపున రోషన్న పోటీ ఖాయమనే ప్రచారం జరుగుతోంది. అంటే రెండు ప్రధాన పార్టీల తరపున అభ్యర్ధులు ఎవరో తేలిపోయింది. ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో తామే అభ్యర్ధులమని వీళ్ళిద్దరు ప్రచారం కూడా చేసుకుంటున్నారు. ఇక తేలాల్సింది కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి ఎవరనే. హస్తంపార్టీ తరపున కమ్మలమ్మా లేకపోతే విజయజ్యోతి పోటీలో ఉంటారా అన్నది తేలటంలేదు. ఇద్దరిలో ఎవరు పోటీలోకి దిగినా పోటీ మాత్రం మంచి పట్టుమీదుంటుందనటంలో సందేహంలేదు.
ఎందుకంటే మాజీ ఎంఎల్ఏ కమలమ్మ, సీనియర్ నేత విజయజ్యోతి ఇద్దరికి నియోజకవర్గంలో పట్టుంది. కాబట్టి బద్వేలులో పోటీ రసవత్తరంగా జరిగే అవకాశాలు ఎక్కువగానే కనబడుతున్నాయి. వైసీపీ ఒంటరిగాను, జనసేన మద్దతుతో టీడీపీ రంగంలోకి దిగుతుంటే కాంగ్రెస్ కూడా ఒంటరిగానే దిగుతోంది. మొత్తంమీద రాబోయే ఎన్నికల్లో పోయిన ఎన్నికల్లో జరిగినట్లుగా ఎలక్షన్ వార్ వన్ సైడ్ మాత్రం కాదని అర్ధమవుతోంది. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.