బీసీలకే టాప్ ప్రయారిటీనా ?

తొందరలోనే జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీసీలకు అత్యధిక టికెట్లు కేటాయించాలని ప్రదేశ్ ఎలక్షన్ కమిటి(పీఇసీ) డిసైడ్ చేసింది. గాంధిభవన్లో జరిగిన పీఈసీ మీటింగులో తెలంగాణా ఇన్చార్జితో పాటు ఏఐసీసీ పరిశీలకులు, రేవంత్ రెడ్డి, మంత్రులు, సభ్యులు పాల్గొన్నారు. ఈ మీటింగులో బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని రేవంత్ చేసిన ప్రతిపాదనకు సానుకూలంగా స్పదించారట మిగిలిన సభ్యులు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు అనుకున్నన్ని టికెట్లు ఇవ్వలేకపోయిన విషయాన్ని రేవంత్ గుర్తుచేశారట.

అప్పట్లో ఇవ్వలేకపోయిన టికెట్లను కనీసం రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో అయినా ఇచ్చి జరిగిన నష్టాన్ని భర్తిచేయాలని రేవంత్ ప్రతిపాదించినట్లు పార్టీవర్గాలు చెప్పాయి. అలాగే ఎస్సీల్లో మాదిగలకు 2, మాలలకు ఒక టికెట్ ఇవ్వాలని, యూత్ కాంగ్రెస్ కోటాలో ఒక టికెట్ కేటాయించాలని కూడా సమావేశం అభిప్రాయపడింది. సమావేశమే అభిప్రాయపడింది కాబట్టి పైన చెప్పినట్లే టికెట్ల కేటాయింపుకు ఎలాంటి అడ్డంకులు ఉండవనే అనుకుంటున్నారు. తెలంగాణాలో బీసీ సామాజికవర్గం చాలా ఎక్కువ. కాబట్టి జనాభా దామాషా ప్రకారం చూసినా బీసీలకు అధిక టికెట్లు ఇవ్వటంలో తప్పులేదన్నది రేవంత్ ఆలోచన.

మొత్తం 17 సీట్లలో రిజర్వుడు సీట్లుపోను మిగిలిన ఓసీ సీట్లలో తక్కువలో తక్కువ ఐదు సీట్లన్నా బీసీలకు ఇవ్వాలని పార్టీలో చర్చలు జోరందుకుంటున్నాయి. 17 నియోజకవర్గాలకు వచ్చిన 309 దరఖాస్తులన్నింటినీ పీఈసీ మీటింగ్ పరిశీలించింది. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా దరఖాస్తులను విడదీసింది. ఒక్కో దరఖాస్తుపైన సమావేశం డీటైల్డ్ గా చర్చించింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపుకు సహకరించిన వారికి, మొన్నటి ఎన్నికల్లో పోటీచేసే అవకాశం కోల్పోయిన వారికి, కష్టకాలంలో పార్టీనే అంటిపెట్టుకుని ఉన్నవారికి టాప్ ప్రయారిటి ఇవ్వాలని సమావేశం నిర్ణయించింది.

వచ్చిన దరఖాస్తుల్లో మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి అత్యధికంగా 48 మంది దరఖాస్తులు చేసుకున్నారు. తర్వాత వరంగల్ పార్లమెంటు టికెట్ కోసం 42 మంది, పెద్దపల్లి సీటుకు 29, భువనగిరికి 28, నాగర్ కర్నూలుకు 26 దరఖాస్తులు చేసుకున్నారు. అత్యంత తక్కువగా మహబూబ్ నగర్ సీటుకు కేవలం నలుగురు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. బహుశా ఈ సీటు వంశీచంద్ రెడ్డికి రిజర్వ్ అయిపోయిందనే ప్రచారం కారణంగానే ఎక్కువమంది ఇంట్రెస్టు చూపలేదేమో.