రాబోయే ఎన్నికల్లో జనసేనతో పొత్తు కారణంగా కొందరు సీనియర్ తమ్ముళ్ళకు భంగపాటు తప్పేట్లులేదు. అలాంటివారిలో మాజీమంత్రి, తెనాలి మాజీ ఎంఎల్ఏ ఆలపాటి రాజేంద్రప్రసాద్ కూడా ఒకళ్ళు. ఆయన పార్టీలో చేరిందగ్గర నుండి రెండుపార్టీ గురించి ఆలోచన కూడా చేయలేదు. టీడీపీలో చేరిన దగ్గర నుండి చంద్రబాబునాయుడు మద్దతుదారుడిగా ఉండిపోయారు. గెలుపోటములతో సంబంధంలేకుండా తెనాలిలో పోటీచేస్తునే ఉన్నారు. పోయిన ఎన్నికల్లో తెనాలిలో జరిగిన ట్రయాంగిల్ పోటీలో ఆలపాటి ఓడిపోయారు.
రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని పట్టుదలగా పనిచేస్తున్నారు. ఇలాంటి సమయంలో జనసేనతో పొత్తు కుదిరింది. జనసేనతో పొత్తువల్ల సమస్య ఏమిటంటే ఆలపాటికి టికెట్ ఇబ్బంది అయ్యింది. రాబోయే ఎన్నికల్లో ఆలపాటికి తెనాలి టికెట్ దక్కటం కష్టమని అర్ధమైపోయింది. ఎందుకంటే ఇక్కడ జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ ఉన్నారు. మనోహర్ కూడా చాలాకాలంగా తెనాలి నుండే పోటీచేస్తున్నారు. టీడీపీ, జనసేన మధ్య పొత్తులేదు కాబట్టి వీళ్ళిద్దరి మధ్య టికెట్ వార్ జరగలేదు. ఇపుడు పొత్తు కుదిరింది కాబట్టి సమస్య మొదలైంది.
ఇక్కడ విషయం ఏమిటంటే తెనాలిలో పవన్ గనుక పోటీచేయకపోతే అధినేత పవన్ కల్యాణ్ కే అవమానం. అందుకోసం తెనాలిలో జనసేన పోటీచేస్తుందని పవన్ గట్టిగా పట్టుబట్టారు. ఇదే సమయంలో ఆలపాటి తెనాలిలో పోటీచేయటం చంద్రబాబుకు అంత ముఖ్యంకాదు. పవన్ కు మనోహర్ ఒక్కడే నేత. కానీ చంద్రబాబుకు ఆలపాటి మాత్రమే కాదు ఇలాంటి మద్దతుదారులు చాలామందే ఉన్నారు. కాబట్టి తెనాలి సీటు టీడీపీ చేయిజారిపోయినట్లే అనుకోవాలి.
అయితే ఇక్కడ విషయం ఏమిటంటే తెనాలి కాకపోయినా గుంటూరు వెస్ట్ లేదా పెదకూరపాడులో అయినా టికెట్ ఇవ్వాలని చంద్రబాబును ఆలపాటి అడిగారు. అందుకు చంద్రబాబు ఏమీ సమాధానం చెప్పలేదని పార్టీ వర్గాల టాక్. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే నాదెండ్ల టికెట్ సాధించుకున్నా ఆలపాటి సహకారం లేకపోతే గెలవలేరు. ఇప్పటికైతే ఇద్దరు పోటీలుపడి నియోజకవర్గంలో ప్రచారం చేసేసుకుంటున్నారు. చివరకు ఎవరు పోటీచేస్తారు ? ఎవరు సహకరిస్తారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates